17 June, 2026 | 10:40 PM

చిరుమర్తి లింగయ్య అనవసరపు ఆరోపణలు మానుకోవాలి

17-06-2026 09:01 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు

చిట్యాల,(విజయక్రాంతి): నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు మండిపడ్డారు. బుధవారం చిట్యాల పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెట్రో రైలు తొలి దశలోనే నష్టాలు వస్తున్నాయని ఎల్‌అండ్‌టీ సంస్థ చేతులెత్తేసిన పరిస్థితుల్లో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని టేకోవర్ చేసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా మెట్రో రైలు రెండో దశ పనుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, అలాంటి సమయంలో ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శించడం సరైంది కాదని అన్నారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని చిరుమర్తి లింగయ్యకు సూచించారు. దమ్ముంటే ఎవరు ఏమిటో ప్రజల ముందే నిరూపించుకుందాం. వేముల వీరేశం స్వగ్రామానికి వెళ్లి ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకుందాం. అలాగే చిరుమర్తి లింగయ్య గ్రామానికి వెళ్లి ప్రజలను అడిగి వాస్తవాలు తెలుసుకుందాం అని సవాల్ విసిరారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని బాధ్యతాయుతంగా మాట్లాడాలని చిరుమర్తి లింగయ్యకు హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.