ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 19(విజయ క్రాంతి): ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ (ఏబీఆర్‌ఎస్‌ఎం) పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏవో కిరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించిన టెట్ అంశంపై 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిందని తెలిపారు.
65 మంది ఉపాధ్యాయులు రివ్యూ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసి 2028 ఆగస్టు 31లోపు టెట్ ఉత్తీర్ణత సాధించేందుకు చివరి అవకాశం కల్పించిందన్నారు. టెట్లో ఉత్తీర్ణత సాధించని పక్షంలో ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో సుమారు 30 వేల మంది, దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
2010 ఏప్రిల్ 1కు ముందు చట్టబద్ధంగా నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు అప్పట్లో టెట్ అర్హత అవసరం లేదని, తర్వాత వచ్చిన నియామకాలకే టెట్ను తప్పనిసరి చేశారని గుర్తు చేశారు.మూడున్నర దశాబ్దాలుగా తమ సబ్జెక్టులను బోధిస్తున్న ఉపాధ్యాయులు, బోధనకు సంబంధం లేని ఇతర అంశాలను చదివి టెట్ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
అందువల్ల 2010 ఏప్రిల్ 1కు ముందు నియమితులైన ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా చట్టం తీసుకురావాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తపస్ కుమురం భీం జిల్లా సలహాదారు ప్రబోధ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు ఆడే శ్రావణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, వినయ్, సంతోష్, సతీష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.






