calender_icon.png 24 February, 2026 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోపాల సవరణకు తక్షణ చర్యలు

24-02-2026 12:05:29 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 23 : జిల్లాలో అమలవుతున్న పీఎం శ్రీ పాఠశాలల పనితీరుపై కేంద్ర నోడల్ అధికారి  ప్రత్యేక పరిశీలకురాలు ఫరీదా మహమూద్ నాయక్ సోమవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సమక్షంలో  కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో జిల్లాలోని  26 పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పాఠశాలల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ పీఎం శ్రీ పాఠశాలల్లో అమలవుతున్న అన్ని కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, మౌలిక సదుపాయాల, విద్య బోధన  అభివృద్ధికి,  ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశీలకురాలు సూచించిన కొన్ని విషయాలపై కూడా  తక్షణ చర్యలు తీసుకొని సవరిస్తామని అన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ  కేంద్ర పరిశీలకురాలు సూచించిన లోపాలను గమనించి తక్షణమే సరిదిద్దే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  బోధనా నాణ్యతను మరింత మెరుగుపరచడం, డిజిటల్ బోర్డుల వినియోగంలో ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడం అవసరమని పేర్కొంటూ, వేసవి కాలంలో సామర్థ్యవృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలు తరచూ పాఠశాలలను సందర్శిస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈఓ ప్రవీణ్ కుమార్,రాష్ట్ర సమన్వయ అధికారి, ఏ.డి జనార్ధన్ రావు,రాష్ట్ర సీఎంఓ సచ్చిదానంద రెడ్డి, ఏఎంఓ డి. శ్రీనివాస్, జి.సి.డి.ఓ అస్రా ఖాద్రి పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.