25 April, 2026 | 8:19 PM

తాగునీటి ఎద్దడిపై సత్వరమే స్పందించాలి

25-04-2026 06:51 PM

ప్రతి ఇంటికీ భగీరథ నీరు చేరాల్సిందే

 వేసవి కార్యాచరణ ప్రణాళిక పక్కాగా అమలు కావాలి

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, (విజయక్రాంతి): వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు సత్వరమే స్పందించి పరిస్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆదేశించారు. శనివారం స్థానిక సింగరేణి అతిథిగృహంలో మిషన్ భగీరథ, కొత్తగూడెం కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎక్కడైనా బోర్ల మరమ్మతులు ఉంటే తక్షణమే పూర్తి చేయాలని, అవసరమైన చోట కొత్త బోర్లు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నీటి సరఫరాలో అంతరాయం కలిగించే పైప్‌లైన్ లీకేజీలను యుద్ధప్రాతిపదికన అరికట్టాలని, కొత్త పైప్‌లైన్ల ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. నీటి సమస్యపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షా సమావేశంలో మేయర్ మూడ్ గణేష్, శాఖల అధికారులు పాల్గొన్నారు.