కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం
లక్షల లీటర్లు తరలింపు, కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్న వైనం
జిన్నారం/ అమీన్ పూర్: జిన్నారం మండలంలోని కొర్లకుంట, కిష్టయ్యపల్లి, గడ్డపోతారం, ఖాజిపల్లి, బొల్లారం ప్రాంతాల్లో పరిశ్రమలు, కంపెనీలకు అక్రమ నీటి దందా జోరుగా సాగుతోంది. స్థానిక వనరులను, ముఖ్యంగా రైతుల పొలాల్లోని బోరుబావులను అక్రమంగా వాడుకుంటూ నీటి మాఫియా(Illegal Water Racket) భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.నీటి అవసరం ఎక్కువగా ఉండటంతో, సమీప పొలాల్లోని బోరుబావుల నుండి 24 గంటలూ నీటిని తోడేస్తున్నారు.
అనుమతి లేకుండా ప్రభుత్వ భూములు, వ్యవసాయ పొలాల్లో బోర్లు వేసి, అక్రమంగా నీటిని తరలిస్తున్నారు.నిత్యం లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు రవాణా చేస్తూ, కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఇంత దందా సాగుతున్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ నీటి తరలింపు వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి, ఆయా ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ అక్రమ నీటి దందా ను ఆపాలని స్థానికులు కోరుతున్నారు.






