30 May, 2026 | 4:01 AM

అక్రమ మైనింగ్ పనులు నిలిపి వేయాలి

30-05-2026 12:40 AM

మొయినాబాద్, మే29(విజయక్రాంతి): మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన గృహ స్థలాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పనుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు జేసీబీలు, లారీలతో భారీగా తవ్వకాలు జరుపుతూ గ్రామాన్ని సమాధి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం వారు తహసీల్దార్కు గ్రామస్తులు  వినతిపత్రం సమర్పించారు.

1998లో అప్పటి ప్రభుత్వం సర్వే నంబర్ 51/1లో దాదాపు 300 మంది నిరుపేదలకు 110 గజాల చొప్పున ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. గతంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి శిలాఫలకం కూడా వేశారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ప్లాట్ల సరిహద్దులు, రోడ్లు స్పష్టంగా ఉన్నప్పటికీ.. వాటిని పూడ్చేస్తూ అడ్డగోలుగా మైనింగ్ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న స్థలాలను నేలమట్టం చేయవద్దని వేడుకుంటున్నారు.