ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా, గడువులో పూర్తి చేయాలి
రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ హరిచందన దాసరి
భూపాలపల్లి,(విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ–2026 కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ హరి చందన దాసరి అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో జరుగుతున్న సవరణ కార్యక్రమ పురోగతిపై జిల్లా వారీగా సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్, ఇంటింటి సర్వే, ఫారాల పంపిణీ–స్వీకరణ, డిజిటలైజేషన్, అర్హులైన ఓటర్ల నమోదు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.
ప్రతి అర్హుడైన ఓటరును జాబితాలో చేర్చేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని, బూత్ స్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లాలో సవరణ ప్రక్రియ పురోగతిని వివరించారు. ఫారాల పంపిణీ పూర్తయిందని, డిజిటలైజేషన్ 72 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. మిగిలిన ప్రక్రియను గడువులోపు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల విభాగ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






