24 July, 2026 | 9:18 PM

సర్ పనుల్లో సార్లు... అక్రమ నిర్మాణాల జోరు

24-07-2026 08:08 PM

బోడుప్పల్ సర్కిల్‌లో అడ్డగోలుగా నిర్మాణాలు...

మున్సిపాలిటీకి భారీగా ఆదాయం గండీ

లెక్క‌లేన‌న్ని అక్ర‌మ నిర్మాణాలు..

చేష్ట‌లుడిగిన యంత్రాంగం

మేడిప‌ల్లి,(విజ‌య‌క్రాంతి): మ‌ల్కాజిగిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ బోడుప్పల్ సర్కిల్ -10 పరిధిలో అధికారులు ఎస్ఐఆర్‌(స‌ర్‌) ప‌నుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇదే అద‌నుగా భావించిన అక్ర‌మార్కులు య‌థేచ్ఛ‌గా అక్రమ నిర్మాణాలు చేప‌డుతున్నారు. వీరిని మంద‌లించే వారేలేక‌పోవ‌డంతో అడ్డూఅదుపు లేకుండా త‌మ ప‌నులు కానిచ్చేస్తున్నారు. స్థానికులు ఎవ‌రైనా అధికారుల‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా అఫీసుల్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో చేసేదేమీలేక మిన్న‌కుండిపోతున్నారు. దీంతో రోజురోజుకూ అక్ర‌మార్కులు రెచ్చిపోతూ నిర్మాణాలు కొన‌సాగిస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించడం, సెట్‌బ్యాక్‌లు లేకుండా భవనాలు కట్టడం, నివాస అనుమతులతో వాణిజ్య సముదాయాలు నిర్మించడం, ఎటువంటి అనుమ‌తులు తీసుకోకుండా షెడ్లూ, షెట్ట‌ర్లు నిర్మించడం మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండీ కొట్ట‌డం వంటి ఉల్లంఘనలు బహిరంగంగానే జరుగుతున్నాయి.

చెంగిచెర్ల డివిజ‌న్ ప‌రిధిలోని రామ‌కృష్ణాన‌గ‌ర్ కాల‌నీలో మున్సిపాలిటీ నుంచి ఎటువంటి అనుమ‌తులు తీసుకోకుండానే ఓ భారీ షెడ్డును నిర్మించారు. అదే విధంగా వ‌క్ఫ్ బోర్డు భూముల్లోనూ అక్ర‌మ నిర్మాణాలు కొన‌సాగుతున్నా చ‌ర్య‌లు తీసుకునేవారే లేకుండాపోయారు. మేడిప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని సాయిన‌గ‌ర్ కాల‌నీలో ఓ భ‌వ‌నం ప‌రిమితికి మించి నిర్మాణం చేప‌డుతున్నారు. దీనిపై ప్ర‌శ్నించేందుకు వెళ్లితే అధికారులు ఆఫీసుల్లో లేరు. పీర్జాదిగూడ డివిజ‌న్ ప‌రిధిలో ఉప్ప‌ల్ డిపో ఎదురుగా ఓ అధికారి పార్టీ నాయ‌కుడు మున్సిపాలిటీ నుంచి ఎటువంటి అనుమ‌తులు లేకుండానే భారీ ఎత్తున క‌మ‌ర్షియ‌ల్ షెడ్డు ఏర్పాటు చేసి వ్యాపారం కొన‌సాగిస్తున్నారు.

ఇలా ఒక‌టి కాదు.. రెండు కాదు బోడుప్ప‌ల్ స‌ర్కిల్ ప‌రిధిలో లెక్క‌లేన‌న్ని అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతూ మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండీ కొడుతున్నారు. అయితే అధికారులు స‌ర్ ప‌నుల్లో బిజీగా ఉంటే అక్ర‌మార్కులు త‌మ ప‌నులు ఈజీగా కానిస్తున్నారు. అయితే గ‌తంలోనూ అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్న‌పుడు కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు కేవలం నోటీసులు జారీ చేయడానికే పరిమితమయ్యారే త‌ప్ప‌, అక్రమ నిర్మాణాలను నిలిపివేయడం లేదా కూల్చివేయడం వంటి చర్యలు చేప‌ట్ట‌క‌పోవ‌డం వెనుక ప‌లు అనుమానాల‌కు తీవిస్తోందంటూ ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

నగర ప్రణాళిక నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగితే భవిష్యత్తులో ట్రాఫిక్, పార్కింగ్, డ్రైనేజీ, అగ్నిమాపక భద్రత వంటి అంశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇరుకైన రోడ్లలో భారీ భవనాలు వెలుస్తుండటంతో అత్యవసర సేవలకు కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణాలు, అనుమతులకు విరుద్ధంగా ఉన్న భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప‌లువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్మాణ అనుమతులు, తనిఖీలు, తీసుకున్న చర్యల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచితే పారదర్శకత పెరుగుతుందని ప‌లువురు సూచిస్తున్నారు.