నిషేధిత భూమిలో అక్రమ నిర్మాణం
- నోటీసులు ఇచ్చినా కొనసాగుతున్న పనులు
- కొల్లూరు సర్వే 125లో అక్రమ షెడ్ నిర్మాణం
- అధికారుల మౌనంపై స్థానికుల ఆందోళన
పటాన్చెరు, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని తెల్లాపూర్ డివిజన్లోని కొల్లూరు గ్రామం సర్వే నెంబర్ 125లో అనుమతులు లేకుండా నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. సర్వే నెంబర్ 125 నిషేధిత జాబితాలో ఉన్న భూమిగా సమాచారం ఉన్నప్పటికీ, దాదాపు వెయ్యి గజాల విస్తీర్ణంలో రేకుల షెడ్ నిర్మాణం జరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ నిర్మాణంపై అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా పనులు కొనసాగుతుండటం గమనార్హం. నోటీసులు ఇచ్చినా నిర్మాణం ఆగకపోవడం, ప్రొహిబిటెడ్ భూమిలో నిర్మాణం కొనసాగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్మాణ పనులు గుట్టుచప్పుడు కాకుండా వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా కోల్పోతున్నట్టు సమాచారం. అధికారుల మౌనం పలు అనుమానాలకు తావిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




