25 March, 2026 | 3:29 AM

క్రైస్తవంలోకి మారితే.. ఎస్సీ హోదా కోల్పోతారు

25-03-2026 01:06 AM

హిందూ, బౌద్ధం, సిక్కు మతం స్వీకరిస్తేనే ఎస్సీ హక్కులు యథాతథం 

క్రైస్తవంలో కులవ్యవస్థ లేదు

పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): హిందూ మతంలో ఎస్సీలుగా ఉన్నవారు క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హక్కులు కోల్పోతారని సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతంలోకి మారితేనే ఎస్సీ హోదాకు అర్హులు అని పేర్కొంది. క్రైస్తవంలోకి మారి పాస్టర్‌గా పనిచేస్తున్న ఏపీకి చెందిన వ్యక్తి పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

ఏపీలోని -బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామానికి చెంది న ఎస్సీ అయిన చింతాడ ఆనంద్ కొన్ని సంవత్సరాల క్రితం పాస్టర్‌గా మారి, గ్రామంలో చర్చి నిర్వహిస్తున్నాడు. అయి తే చర్చి నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డితో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయి తే అక్కల రామిరెడ్డి, ఇతరులు తనపై దాడి చేశారని, తనతోపాటు తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూ కులం పేరుతో దూషించారని, వారిపై ఆనంద్ అట్రాసిటీ చట్టం కింద పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.

అయితే ఆనంద్ ఎస్సీ నుంచి క్రైస్తవంలోకి మారినందున రాజ్యాంగం ప్రకారం ఎస్సీ హక్కులు పొందలేడని, క్రైస్తవంలో కులాలు ఉండవని పేర్కొంటూ తమపై పెట్టిన అట్రాసిటీ కేసును కొట్టివేయాలంటూ రామిరెడ్డి తోపాటు ఇతరులు ఏపీ హైకోర్టును ఆశ్ర యించారు. పుట్టుకతో హిందువు అయి నా.. క్రైస్తవం స్వీకరించడంతో అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు ఆనంద్‌కు వర్తించవని, రామి రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఆనంద్ క్రైస్తవం స్వీకరించడంతో, ఆయన షెడ్యూల్ కులానికి చెందడని వారు పేర్కొన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. క్రైస్తవ మతంలో కులవ్యవస్థ లేదని, హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీ హక్కులు పొందేందుకు అర్హులంటూ తీర్పునిచ్చింది. ఎస్సీ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రన అట్రాసిటీ చట్టం నుంచి రక్షణ పొందలేరని పేర్కొంది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ 2025 మేలో ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. 

హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని ఎస్సీలు క్రైస్తవం స్వీకరిస్తే ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పదేళ్లుగా పాస్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్.. తిరిగి హిందువుగా మారనందున ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది.