సినిమాలో కంటెంట్ ఉంటే ఐపీఎల్ ప్రభావం చూపదు!
ప్రదీప్ రంగనాథన్ హీరోగా దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందిస్తున్న క్రేజీ ప్రేమకథా చిత్రం ‘ఎల్‌ఐకే ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా, ఎస్‌జే సూర్య, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. శ్రీపద్మిని సినిమాస్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివప్రసాద్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
“ఈ సినిమాకు నిరుడు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఈ సినిమా కోసం చాలా మంది ప్రయత్నించారు. కానీ మేమే ముందుగా కమిట్ అయినందున వాళ్లు మాకిచ్చారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. దాదాపు 500 స్క్రీన్లలో విడుదల కానుంది. డిస్ట్రిబ్యూషన్ పరంగా మేము సేఫ్‌గా ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఫ్యూచర్ టెక్నాలజీ ఆధారంగా చేసుకుని డిజైన్ చేసిన స్టోరీ ఇది.
టెక్నాలజీ హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్‌ను ప్రభావం చూపితే ఎలా ఉంటుందనే విషయం ఈ సినిమాలో ప్రధానంగా ఉంటుంది. టెక్నాలజీ కారణంగా మనుషుల మధ్య సంబంధాలు హార్ట్‌ఫుల్‌గా కాకుండా ఆర్టిఫిషియల్‌గా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. విగ్నేష్ శివన్ కూడా అద్భుతమైన డైరెక్టర్. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్.
ఇది ఫుల్-లెంగ్త్ ఎంటర్‌టైనర్. ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమాలపై ఉండదు. సినిమా బాగుంటే, చూడాలనుకునే ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. సినిమా మంచి కంటెంట్‌తో ఉంటే ఐపీఎల్ పెద్దగా ప్రభావం చూపదని నేను భావిస్తున్నా. విజయ్ సేతుపతి ప్రస్తుతం చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. మేము ఇంకా పరిశ్రమలో స్థిరపడిన తర్వాత కథ చెప్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నాం. మా తమ్ముడు అజయ్ హీరోగా ‘రంగూన్ రాజా’ సినిమా చేశాం. దాన్ని జూన్ లేదా జూలైలో విడుదల చేయాలనుకుంటున్నాం. ‘మహతి’ సినిమా కూడా త్వరలో సిద్ధమవుతుంది.




