బీఎస్పీకి కొత్త ఊపిరి!
పదవుల నుంచి పవర్ వైపు ఇబ్రాం శేఖర్ ప్రభంజనం
బీఎస్పీ రాష్ట్ర సారథిగా ఏడాది పూర్తి
మాన్యంవర్ కాన్షీరాం ఆశయాలే మార్గదర్శకం
క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి అడుగులు
రంగారెడ్డి, ఆగస్టు 28 (విజయక్రాంతి): రాజకీయాల్లో నాయకులు వస్తుంటారు, వెళ్తుంటారు. కొందరు పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయ వేది కలను ఉపయోగించుకుంటే... కొందరు అ రుదైన నాయకులు మాత్రమే తమ జీవితాన్ని, సమయాన్ని సామాజిక ఉద్యమానికి అంకితం చేస్తారు.
అలాంటి బహుజన ఉ ద్యమ నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్. బిఎస్పీ అధినేత్రి బెహెన్ కుమారి మాయావతి ఆశీస్సులతో, పార్టీ చీఫ్ సెక్టార్ కో ఆర్డినేటర్లు ఆథర్ సింగ్, సురేష్ ఆర్యల మార్గదర్శనంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఇబ్రాం శేఖర్ తన పదవీ కాలాన్ని దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్నారు.
బహుజన భావజాలానికి సోదరుడే స్ఫూర్తి....
ఇబ్రాం శేఖర్ రాజకీయ ప్రయాణం వెనుక బలమైన సామాజిక పునాది ఇంటి నుంచే పడింది. చిన్నతనం ను ంచే ఆయనకు మార్గదర్శకుడిగా నిలిచిన సోదరుడు ఇబ్రాం మైసన్న చూపిన దారిలో పయనిస్తూ ఉద్యమ చైతన్యాన్ని, బహుజన భావజాలాన్ని ఒంటబట్టించుకున్నారు. బహుజన స్ఫూర్తి ప్రదాతలు గౌతమ బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మాన్యంవర్ కాన్షీరాం సిద్ధాంతాలను ఆచరిస్తూ... కాన్షీరాం జీవిత చరిత్రకు సంబంధించిన వేలాది పుస్తకాలను పంపిణీ చేసి యువతలో రాజకీయ బియ్యం నాటేందుకు కంకణం కట్టుకున్నారు.అను నిత్యం అందుకోసం అవగాహన పెంచేందుకు శ్రమిస్తున్నారు.
వార్డు మెంబర్ నుంచి డిప్యూటీ మేయర్ వరకు..
సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించిన శేఖర్ బాలాపూర్ సర్పంచ్గా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, మున్సిపల్ డిప్యూటీ మేయర్ బాధ్యతలను నిర్వహించిన ’ప్రూవ్డ్ లీడర్’ గా రాష్ట్రంలోనే గుర్తింపు పొందారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో స్థానిక సమస్యలను సమర్థవంతంగా అర్థం చేసుకుని పోరాటాలు నిర్మించారు.పదవులను కేవలం గుర్తింపుగా కాకుండా, మహానీయుల ఆశయాల సాధనకు సాధనాలుగా మార్చుకున్నారు.
ప్రజా సమస్యలపై గళం
ఇబ్రాం శేఖర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో బిఎస్పీకి సరికొత్త ఊపిరి ఊదారు. సంస్థాగత బలోపేతానికి ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పల్లె నుంచి పట్నం వరకు ప్రజా సమస్యల పై గళం విప్పేలా కార్యకర్తలో నాయకులో స్ఫూర్తి నింపుతున్నారు.
స్థానిక సంస్థల్లో ఏనుగు గుర్తు..
చాలాకాలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ’ఏనుగు’ గుర్తు అందుబాటులో లేక అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయాల్సి వచ్చేది. ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద చొరవ తీసుకుని ’ఏనుగు’ గుర్తును రిజిస్టర్ చేయించి, పార్టీకి పెద్ద కొండంత అండగా నిలిచారు. పార్టీ సొంత గుర్తు సాధించడంతో స్థానిక సంస్థల్లో సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఇద్దరు కార్పొరేటర్లు ఘనవిజయం సాధించారు.
‘ఇంటింటికీ బీఎస్పీ’ నినాదం
గ్రామాలు, మండలాల్లో సెక్టార్, బూత్ కమిటీలను శరవేగంగా నిర్మించారు. జనాభా ప్రాతిపదికన బిసి వర్గాలకు పదవుల్లోనూ, స్థానిక ఎన్నికల టికెట్లలోనూ దామాషా పద్ధతిన న్యాయం చేకూరుస్తున్నారు. తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా ”రాజకీయ అధికారమే సమస్త సమస్యలకు పరిష్కారం‘ అన్న కాన్షీరాం సూక్తిని తెలంగాణ బహుజనుల్లోకి బలంగా తీసుకెళ్తున్న శేఖర్, నిర్ణయాధికారం అణగారిన వర్గాల చేతికి వచ్చినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. వరుస సమీక్షా సమావేశాలు, ప్రజాపోరాటాలు, రౌండ్ టేబుల్ సమావేశాలతో పార్టీని మళ్లీ ప్రజాచర్చల్లో కేంద్ర బిందువుగా మార్చారు.






