మొండికుంట అభివృద్ధికి అండగా ఉంటా..
- సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
- ఎమ్మెల్యేను కలిసిన సర్పంచ్ మర్రి సంధ్య, గ్రామస్తులు
అశ్వాపురం, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లును మొండికుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ మర్రి సంధ్య, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి తమ అప్యాయతను చాటుకున్నారు. అనంతరం గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
కరువైన గూడు.. ఆదుకోవాలి చూడు!
సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా బి.జి. కొత్తూరు గ్రామంలో జరిగిన పేలుళ్ల వల్ల దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో, బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు కోసం సుమారు 102 ఎకరాల పచ్చని వ్యవసాయ భూములను త్యాగం చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాగు భూములు కోల్పోయినా.. పుట్టిన ఊరిపై ఉన్న మమకారంతో పొరుగు గ్రామాలకు వెళ్లి కూలీలుగా బతుకీడుస్తున్నారని, ఉండటానికి కనీస గూడు కూడా కరువైన ఆ అభాగ్యులకు మొండికుంట గ్రామ పంచాయతీ పరిధిలో అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.
మౌలిక సదుపాయాల కల్పనకు వినతి
మొండికుంట గ్రామ పంచాయతీ ప్రధాన రహదారికి ఇరువైపులా అర్ధాంతరంగా నిలిచిపోయిన మురుగు కాల్వల (డ్రైనేజీ) నిర్మాణాలను వెంటనే పూర్తి చేయించాలని కోరారు. గ్రామంలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల విస్తరణతో పాటు అవసరమైన చోట నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు.
అభివృద్ధికి నాది భరోసా: ఎమ్మెల్యే పాయం
గ్రామస్తుల విన్నపాలపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సానుకూలంగా, ఆత్మీయంగా స్పందించారు. త్వరలోనే సంబంధిత అధికారులను పంపించి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, అనంతరం పనుల మంజూరుకు సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొండికుంట గ్రామ పంచాయతీ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని గ్రామస్తులకు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి సంధ్యతో పాటు ఉప సర్పంచ్ చలమల్ల శివకుమార్, వార్డు సభ్యులు ఆకిటి సిద్ధార్థ రెడ్డి, గ్రామస్తులు కొల్లు ఉప్పల్ రెడ్డి, పూజల రవి, మర్రి శంభారెడ్డి, తెల్లం కాంతారావు, పూణెం మల్లయ్య, పూణెం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.






