6 May, 2026 | 1:55 AM

సీఎం పదవికి రాజీనామా చేయను

06-05-2026 12:36 AM
  1. ఎన్నికల తీర్పు ప్రజా తీర్పు కాదు
  2. బీజేపీ కుట్రపన్ని ఎలక్షన్‌ను ప్రభావితం చేసింది
  3. నైతిక విజయం తృణమూల్ పార్టీదే
  4. ఇక ముందు ఇండియా కూటమి బలోపేతానికి కృషి చేస్తాం
  5. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 
  6. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ధిక్కార స్వరం

కోల్‌కతా, మే ౫: తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. బంగాల్ ఎన్నికల ఫలితాలు ప్రజా తీర్పు కాదని, ఇదంతా బీజేపీ పెద్ద కుట్ర అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర బలగాలను అడ్డం పెట్టుకుని ఆ పార్టీ ఎన్నికలను ప్రభావితం చేశారని వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

కేంద్రం ఎన్నికల ముందు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులందరినీ మార్చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పోరాటం బీజేపీతో కంటే ఎక్కువగా ఎన్నికల కమిషన్‌తోనే సాగిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామిక హక్కులను కాలరాసిందని ఆరోపించారు. ఈవీఎంలను తారుమారు చేసిందని, సీఈసీ జ్ఞానేష్‌కుమార్ విలన్‌గా వ్యవహరించారని మండిపడ్డారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా, కొన్ని ఈవీఎంలలో 80-90 శాతం ఛార్జింగ్ ఉందని, అదెలా సాధ్యమని ప్రశ్నించారు.

సర్ పేరిట 90 లక్షల మంది ఓటర్ల తొలగించారని, తాము కోర్టును ఆశ్రయిస్తే తిరిగి, 32 లక్షల పేర్లను చేర్చారని గుర్తుచేశారు. ఈ విషయంలో ఇకముందు కూడా న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తన జీవితంలో ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ తదితరులు తనకు కాల్ చేసి సంఘీభావం తెలిపారని వెల్లడించారు. ఇకపై ‘ఇండియా’ కూటమి బలోపేతానికి తమ పార్టీ కృషి చేస్తుందని వివరించారు. ఎన్నికల్లో నైతికంగా గెలిచింది తమ పార్టీనే గెలిచిందని చెప్పుకొచ్చారు. మున్ముందు తమ పార్టీ పులిలా పోరాడి మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

9న కొత్త ప్రభుత్వం

కోల్‌కతా, మే ౫: బెంగాల్‌లో ప్రస్తు త ప్రభుత్వం పదవీ కాలం ఈనెల 6వ తేదీతో ముగియనుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఈలోపు ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చే యాల్సి ఉంటుంది. అయితే.. సీఎం మమత అందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మా రింది. ఒకవేళ ఆమె స్వచ్ఛందంగా తప్పుకోకపోతే గవర్నర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆమె ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, ఐదేళ్ల గడువు ముగిసిన తర్వాత పదవిలో ఉండటం నిబంధనలకు విరు ద్ధం. ఏదేమైనా బీజేపీకి మెజారిటీ రా వడంతో 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవ కాశం ఉంది.