రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?
- నేడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌తో భేటీ
- టీవీకే శాసనసభ పక్ష నేతగా విజయ్
- ఏకగీవ్రంగా ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు
- ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్ రాజీనామా
- ఆమోదించిన గవర్నర్
చెన్నై, మే ౫: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ఈనెల 7న ప్రమాణ స్వీకారం చేస్తారని, దీనిలో భాగంగానే బుధవారం ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో భేటీ కానున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారమే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అంతకుముందు తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, తమకు రెండు వారాల గడువు ఇవ్వాలని టీవీకే అధినేత విజయ్ మంగళవారం గవర్నర్‌కు లేఖ రాశారు.
తమ పార్టీకీ ౧౦౮ సీట్లు వచ్చాయని, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ తమదేనని, అందుకే తొలి అవకాశం తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మేజిక్ ఫిగర్ ౧౧౮ని అధిగమించేందుకు ౧0 సీట్లు అవసరం ఉన్న నేపథ్యంలో గడువు కోరుతున్నామని రాసుకొచ్చారు. ఇదేరోజు చెన్నైలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విజయ్ తన ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ముందుగా పెరియార్ రామస్వామి నాయకర్, అంబేద్కర్, కామరాజ్ నాడార్ వంటి ప్రముఖుల విగ్రహాలకు నివాళి అర్పించారు.
ఎమ్మెల్యేలు అనంతరం విజయ్‌ని పార్టీ శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయ్ రాష్ట్రంలోని పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. పెరంబూర్ స్థానాన్ని అట్టిపెట్టుకుని, రెండో స్థానంలో తన పదవికి రాజీనామా చేయాలని విజయ్ భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్ సైతం ఆమోదించారు.
మంతనాలు
టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, పీఎంకే సుముఖంగా ఉన్నాయని సమాచారం. ఇరు పార్టీల ఎమ్మెల్యేలు ఒకవేళ టీవీకేకు మద్దతు ఇస్తే.. చెరొక మంత్రి పదవి అడుగుతున్నట్లు తెలిసింది. ఇదే అంశంపై విజయ్‌తో సోమవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఫోన్‌లో సంభాషించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
వామపక్ష పార్టీలు సైతం టీవీకే నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ మద్దతు మాత్రమే విజయ్‌కు సరిపోదని, ఏఐఏడీఎంకే మద్దతు కూడా అవసర పడవచ్చని డీఎంకే నేతలు అభిప్రాయపడుతున్నారు. మెజార్టీ సీట్ల కోసం విజయ్ తమ మద్దతు కోరినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించడం గమనార్హం






