సత్తుపల్లిలో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు
సత్తుపల్లి. ఆగస్టు 9, (విజయక్రాంతి): టాలీవుడ్ సూపర్ స్టార్, మానవతావాది, ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను సత్తుపల్లి పట్టణంలో ఆయన అభిమానులు అత్యంత ఘనంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. సత్తుపల్లి పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో అభిమానులు కోలాహలంగా వేడుకలు నిర్వహించి, తమ అభిమాన హీరోపై ఉన్న అచంచలమైన ప్రేమను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ప్రాంతానికి చెందిన సీనియర్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్‌ను సీనియర్ అభిమానులు కలిసి కట్ చేశారు. అనంతరం మిఠాయిలు పంచుకుంటూ కేరింతలు కొట్టారు. "హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్" అంటూ నినాదాలతో పట్టణం మార్మోగింది.
ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ.. కేవలం వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ మహేష్ బాబు ఎంతో మందికి ఆదర్శప్రాయులని కొనియాడారు. 'మహేష్ బాబు ఫౌండేషన్' ద్వారా ఆయన ఎన్నో వందల మంది గుండెజబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ప్రాణాపాయ శస్త్రచికిత్సలు చేయిస్తూ నిజ జీవితంలోనూ రియల్ హీరోగా నిలిచారని ప్రశంసించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తాము కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ వేదికగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ అభిమానులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.






