ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రపంచ ఆదివాసీ ప్రజల దినోత్సవం( World Indigenous Peoples' Day) సందర్భంగా, ప్రకృతిని దైవంగా, అడవిని తమ తల్లిగా పూజిస్తూ, తరతరాలుగా తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ప్రపంచ నాగరికతకు మూలం, ప్రకృతితో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్న జీవనశైలి - అదే ఆదివాసీ ప్రజల సంస్కృతి. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణను తమ మనుగడకు మూలస్తంభంగా చేసుకున్న ఆదివాసీ సమాజాల జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, సామూహిక జీవన విధానం, సాంస్కృతిక పరిరక్షణ, యావత్ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. వారి హక్కులను, వారి ఉనికిని, వారి సంస్కృతిని గౌరవించడానికి, వారి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవాన్ని నిర్ధారించడానికి మనమందరం ఏకమవుదాం,” అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.






