కోర్టుకు ఈడుస్తా.. జాగ్రత్త!
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు జాగృతి అధ్యక్షరాలు కవిత వార్నింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 (విజయక్రాంతి): మూసీ ప్రాజెక్టు, హైడ్రా వ్యవ హారాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై యుద్ధం ప్రకటించారు. ‘మిస్టర్ రంగనాథ్.. నిన్ను కోర్టుకు ఈడుస్తా జాగ్రత్త.. ఆధారాలు లేకుండా నేను ఏదీ మాట్లాడను’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆదివారం జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
నార్సింగ్ భూముల వ్యవహారంలో హైడ్రా తనపై చేసిన అసత్య ప్రచారాలను ఆదివారం సాయంత్రంలోపు తొలగించకపోతే, సోమవారం ఉదయమే పరువు నష్టం దావా వేస్తానని డెడ్ లైన్ విధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా అనే మహమ్మారిని ప్రజల మీదకు వదిలారని కవిత మండి పడ్డారు. నార్సింగిలో మూసీ నది మధ్యలో ఒక ప్రైవేట్ రియల్టర్ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై తాము ఆందోళన చేస్తే, హైడ్రా ఎదురుదాడి చేస్తూ వీడియోలు రిలీజ్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.
రంగనాథ్ గారూ.. మీరేమైనా గ్రాఫిక్ డిజైనర్లా లేక కంటెంట్ క్రియేటర్లా నిజాలు మాట్లాడితే మాపై వీడియోలు తీసి పెడతారా..అని నిలదీశారు. గత ఏడాది అక్టోబర్ 10న రంగనాథ్ స్వయంగా తహసీల్దార్‌కు రాసిన లేఖను కవిత బయటపెట్టారు. సదరు నిర్మా ణాల వల్ల మూసీకి వరద ముప్పు ఉంద ని, ప్రాణాలకు ప్ర మాదమని మీరే లేఖ రాసి.. ఇప్పుడు మాకు సంబంధం లేదని వీడియోలు ఎలా వదులుతారు అని ప్రశ్నించారు.
ఆ రియల్టర్ పైకి బుల్డోజర్లు తీసుకువెళ్లే ధైర్యం ఉందా అని ఆమె సవాల్ విసిరారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వివరాలను బ్యాంకులకు చెబుతున్న ప్రభుత్వం, ప్రజలకు ఎందుకు వివరించడం లేదని కవిత నిలదీశారు. సమగ్రమైన డీపీఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసానికి పాల్పడుతోం దని ఆరోపించారు. సెప్టెంబర్ 2025 లో ఫేజ్-1 కోసం రూ. 5,641 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.
ఇప్పుడు ఆరు నెలలు తిరగకముందే తాజా ప్రజెంటేషన్‌లో రూ 6,500 నుంచి 7,000 కోట్లు అవుతుందని ఎలా చెపుతారు.. ఈ అదనపు రూ. 1,500 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అని ప్ర శ్నించారు. మూసీ అభివృద్ధి పేరుతో 1,430 ఆస్తులను కూల్చేయాలని చూస్తున్న ప్రభు త్వం, బాధితులతో ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గబోమని కవిత హెచ్చరించారు.




