30 June, 2026 | 2:11 PM

సీఎం పర్యటన విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

30-06-2026 01:23 PM

జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్,  ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్,

కల్వకుర్తి జూన్ 30: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy ) త్వరలో నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల కేంద్రంలోని అత్యంత ప్రసిద్ధ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై మంగళవారం ఉదయం  జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి ఉర్కొండలో విస్తృతంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.

 అధికారులతో కలిసి పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలను సందర్శించి, ముఖ్యమంత్రి ఆలయ దర్శనం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఆలయ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు, అత్యవసర సేవల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అనంతరం ఉర్కొండపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానాన్ని సందర్శించి, ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ప్రతిపాదించే హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.   పర్యటనలో భాగంగా ఉర్కొండ మండలంలో ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ మండల స్థాయి అధికారుల కార్యాలయ సముదాయం నిర్మాణానికి, నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాలను  జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.  స్థల సేకరణ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన ప్రతిపాదనలను త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఉర్కొండ రైతు వేదికలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దేవ సహాయం, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, జిల్లా ఏడి సర్వేయర్ గిరిధర్, ఉర్కొండ తహసీల్దార్ యూసుఫ్ అలీ, ఎంపీడీవో, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.