వర్సిటీ ప్రారంభోత్సవ ఆహ్వానానికే వచ్చా
- మా మామయ్య పోటీ చేయమంటే నేను రెఢీ
- బీజేపీ ఆఫీస్‌కు వెళ్లిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): తాను బీజేపీ పార్టీలో చేరడం లేదని, ఏఐ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఆహ్వానం ఇచ్చేందుకే బీజేపీ కార్యాలయానికి వచ్చానని, ఎంపీ టికెట్ కోసం కాదని మాజీమంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తెలిపారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, కేవలం తమ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకే కార్యాలయానికి వచ్చానని తెలిపారు.
శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన ఆమె రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయాల గురించి మాట్లాడట్లేదని, ప్రస్తుతం తాను విద్యా వ్యవస్థ కోసం పాటుపడుతున్నానని, రేపు ఏదైనా జరగొచ్చని చెప్పారు. ‘హిందూ పండుగలను తాను సెలబ్రేట్ చేసుకుంటాను అంతమాత్రాన బీజేపీ కోసం పాటుపడుతున్నట్లు కాదు కదా’ అన్నారు.
రాజకీయాల గురించి ఆలోచించట్లేదన్నారు. మా మామయ్య రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. ఆయన పోటీ చేయమంటే పోటీ చేసేందుకు రెఢీ’ అన్నారు. తాను అన్ని పార్టీల నాయకులను కలుస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తానన్నారు. యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీని ఆహ్వానిం చేందుకు ఇటీవల వెళ్లినట్లు తెలిపారు.
మల్లారెడ్డి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని ఆమె పేర్కొ న్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని మల్లారెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ కార్యాలయానికి వెళ్లడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల క్రితం బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావును కూడా ప్రీతిరెడ్డి కలిశారు.






