18 March, 2026 | 3:16 PM

పార్కు స్థలం కబ్జాపై హైడ్రా చెక్

18-03-2026 12:00 AM

కొండాపూర్‌లో రెండెకరాల పార్కు స్థలం స్వాధీనం ఫెన్సింగ్ ఏర్పాటు

శేరిలింగంపల్లి, మార్చి 17 (విజయక్రాంతి): హైటెక్ హబ్‌గా పేరుగాంచిన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్కు కోసం కేటాయించిన కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని హైడ్రా ఆక్రమణదారుల గుప్పిట్లోనుంచి కాపాడింది. శేరిలింగంపల్లి లో ఎకరానికి 100 కోట్లు పై మాటే ఉన్న పరిస్థితుల్లో ఈ భూమి విలువ భారీగా ఉండటం గమనార్హం. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నంబరు 110/1 లో 148 ప్లాట్లతో 16 ఎకరాల మేర సెంట్రల్ పార్కు కాలనీ ఫేజ్-1 పేరుతో 1998లో లే ఔట్ వేశారు.

ఇందులో 2 ఎకరాలను పార్కు కోసం కేటాయించగా.. మున్సిపల్ అధికారులు పార్కు స్థలంగా హద్దులు నిర్ధారించి ప్రహరీ కూడా నిర్మించారు.ఈ స్థలంపై కొంతమంది ఆక్రమణదారులు తాత్కాలిక షెడ్లు వేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కాలనీవాసులు అడ్డుకోవడంతో బెదిరింపులకు కూడా దిగిన ఘటన లు చోటుచేసుకున్నాయి. దీనిపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.

పార్కు స్థలంగా నిర్ధారించి మంగళవారం ఉదయం ఆక్రమణ షెడ్లను పూర్తిగా తొలగించారు. అనంతరం భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలపై కబ్జాలు జరుగుతుంటే వ్యవస్థలు నిద్రపోతాయా లేక హైడ్రా లాంటి చర్యలే పరిష్కారమా అన్నదే ఇప్పుడు చర్చనీయంగా మారింది.