4 April, 2026 | 3:53 AM

భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త

04-04-2026 02:05 AM
  1. పుత్ర సంతానం కోసం ఘాతుకం
  2. హనుమకొండ జిల్లా ఐలోని మండలంలో ఘటన
  3. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు

మహబూబాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): పుత్ర సంతాన ప్రీతితో ఇద్దరు ఆడపిల్లలు, భార్యతో పాటు గర్భంలో ఉన్న పిండాన్ని సైతం  కడ తేర్చాడో తండ్రి. హనుమకొండ జిల్లా ఐలోని మండలం పున్నెలు గ్రామం శివారులో బుధవారం రాత్రి తల్లి, ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్‌లో మరణించిన ఘటనపై పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.

అజారుద్దీన్ అనే వ్యక్తి తన భార్య ఫర్హాత్ (26), కుమార్తెలు కుబేర (8), ఆయేషా (6) ముగ్గురిని తాము నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ లో ముంచి హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలను కన్న ఫర్హాత్, గతంలో రెండుసార్లు గర్భం దాల్చిన సమయంలో కూడా ఆడపిల్లలని తేలడంతో అబార్షన్ చేయించిన అజారుద్దీన్,మళ్లీ ఇటీవల భార్య గర్భవతి కావడంతో పుట్టబోయే బిడ్డ కూడా ఆడపిల్లేనని అబార్షన్ చేయించుకోవాలంటూ భార్యపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చిన ఆమె ససేమిరా అనడంతో పథకం ప్రకారం భార్య ఇద్దరు పిల్లలను స్విమ్మింగ్ పూల్‌కు తీసుకువెళ్లి అందులోకి తోసి చంపేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

పుత్ర సంతానం కోసం వారిని తానే హతమార్చిన అతన్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.తొలుత ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణిం చార ని నమ్మించే ప్రయత్నం చేసిన అజారుద్దీన్ వ్యవహార శైలి, అంతకుముందే భార్యతో వివాదం నేపథ్యం లో తమ అల్లుడు తన బిడ్డ , ఇద్దరు మనవరాళ్లను హత్య చేశాడని ఫర్హాన్ తండ్రి అలీ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యా దు చేయడంతో, వరంగల్ నగర సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈ కేసును ప్రత్యక్షంగా పర్యవేక్షించడంతో కేసు మిస్టరీ గంటల వ్యవధిలోనే పోలీసులు చేదించారు.

లింగ నిర్ధారణ చేసింది ఎవరు?

ఈ సంఘటనలో ప్రాణాలు వదిలిన ఫర్హాన్ గతంలో రెండుసార్లు గర్భం దాల్చగా లింగ నిర్ధారణ చేసి పుట్టబోయేది ఆడపిల్లగా నిర్ధారించిన లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ నిర్వహించారనే విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు సమాచారం.తాజాగా ఫర్హాన్ కడుపులో పెరుగుతున్నది కూడా ఆడపిల్ల అని కూడా అజారుద్దీన్ నమ్మడానికి కారణం ఏమిటనే విషయంపై కూడా లోతుగా విచారణ చేపట్టారు. 

వరంగల్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కొందరు స్కానింగ్ సెంటర్ల యజమానులు, డాక్టర్లు తమ నైతికతకు తిలోదకా లిచ్చి లింగ నిర్ధారణ పరీక్షలునిర్వహించి పుట్టబోయేది ఆడో మగో చెబుతున్నారనడానికి ఈ సంఘటన మరోసారి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు యంత్రాంగం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్ల యజమానులు ఇలా పుట్టబోయేది ఆడ మగ తెలపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.