4 April, 2026 | 4:53 AM

హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేయాలి

04-04-2026 03:04 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తున్న ప్రభుత్వం

జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య 

ముషీరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా అన్యాయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షు లు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. హైకోర్టు తీర్పు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వ పాలసీ, సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. అయినా ప్రభుత్వం ఫీజుల కేసు విషయమై సరైన వాదనలు వినిపించకపోవడం, అడ్వకేట్ జనరల్ అసమర్థత వల్లే హైకోర్టు ఆ తీర్పు ఇచ్చిందన్నారు. 

కోర్టు మీద నెట్టివేసి ప్రభుత్వం ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం ఎత్తి వేసే కుట్రలో భాగమని అన్నారు. ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే ప్రతి పక్షాలు మౌనంగా ఉండడం సరికాదని, దీనిపై గొంతె త్తి ప్రశ్నించాలని అన్నారు. కాలేజి యాజమాన్యాలు రాజీ పడి విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయొద్దన్నారు. కాలేజీల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ తీర్పుపై వెంట నే అప్పీల్ చేసి నిబద్ధత చాటుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూ.6 వేల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వ పాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ నేతలు సీ.రాజేందర్, మోడీ రాందేవ్, గొరిగె మల్లేష్ యాదవ్, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.