6 May, 2026 | 3:36 AM

9 నుంచి అమరణ నిరాహార దీక్ష

06-05-2026 02:13 AM
  1. జనగణనలో కులగణన చేయాల్సిందే 
  2. బీసీ సంఘాలు, నాయకులు ఏకమై పోరాటం చేయాలి 
  3. ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు  

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓబీసీలకు తీవ్ర అన్యా యం చేస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రభు త్వ సలహాదారు వి. హనుమంతరావు విమర్శించారు. దేశంలోని ఓబీసీల జనాభా తెలియకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జనగణన జాబితాలో ఓబీసీ కాలం ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. కేంద్రం తీరుకు నిరసగాన ఈ నెల 9 తేదీ నుంచి ఆమరణ నిరహార దీక్షను చేయనున్నట్లు వీహెచ్ తెలిపారు.

మంగళ వారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. జనగణనలో ఓబీసీ కాలం పెట్టాలని ప్రధాని మో దీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ నెల 8 వరకు చూస్తామన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చే కంటే ముందే బీసీల విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, లేదంటే 9వ తేదీ నుంచి అమరణనిరహర దీక్ష చేస్తానని వీహెచ్ తెలిపారు. బీసీల లెక్కలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కావని, అందుకు బీసీ సంఘాలు, నాయకులు అప్రమత్తంగా ఉండి సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ విషయంలో బీజేపీకి చెందిన బీసీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు బంగా రం ధరలు భారీగా పెరిగాయని ఆయన మండిపడ్డారు. డీజిల్ ధర 2014లో రూ. 61 ఉంటే ఇప్పుడు రూ. 96, పెట్రోల్ రూ. 70 నుంచి రూ. 107లకు పెరిగిందన్నారు.

ఇక గ్యాస్ ధర 2014లో రూ. 600 ఉంటే ఇప్పుడు రూ. 965, కమర్షియల్ సిలిండర్ రూ. 1200 నుంచి రూ. 3,300లకు వరకు పెంచారని మండిపడ్డారు. బంగారం ధర 2014లో 10 గ్రాములకు రూ.28 వేలు ఉంటే ఇప్పుడు రూ.1.52 లక్షకు పెరిగిందని, ఇవన్ని పదేళ్లలో ప్రజలపై మోదీ మోపిన భారమేనని వీ హనుమంతరావు మండిపడ్డారు.