బంగారు బిస్కెట్ల పేరిట భారీ మోసం
కిలో ఆభరణాలతో పరార్
బంజారాహిల్స్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బంజారాహిల్స్‌లో ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ వ్యక్తికి పీఏగా పరిచయం చేసుకున్న వ్యక్తి, తన మేడమ్ వద్ద భారీగా బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటిని ఇచ్చి ఆభరణాలు కొనుగోలు చేస్తామని నమ్మబలికాడు. నకిలీ బంగారు బిస్కెట్లను అసలైనవిగా నమ్మించి, జ్యువెలరీ షాపు యజమాని నుంచి సుమారు ఒక కిలో బరువున్న బంగారు ఆభరణాలను తీసుకుని నిందితుడు పరారయ్యాడు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో, సదరు మోసగాడు చెప్పిన మాటలు నమ్మిన వ్యాపారి కుమార్తె ఈ మోసానికి గురయ్యారని పోలీసులు తెలిపారు. నిందితుడు గతంలో మూడుసార్లు అసలు బంగారు బిస్కెట్లే ఇచ్చి నగలు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తూ, నాలుగోసారి నకిలీ బంగారాన్ని అంటగట్టినట్లుగా చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.




