‘మెడికవర్’లో హెచ్‌టీవో ఇంప్లాంట్
28 ఏళ్ల యువ వైద్యుడికి జాయింట్ ప్రిజర్వేషన్ శస్త్రచికిత్స
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిస్తూ భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్ సంస్థ దేశంలోనే తయారు చేసిన హై టిబియల్ ఆస్టియోటమీ (హెచ్‌టీవో) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. ఈ దేశీయ ఇంప్లాంట్‌తో సీనియర్ జాయింట్ ప్రిజర్వేషన్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ సర్జన్ డా. రఘువీర్‌రెడ్డి నేతృత్వంలో 28 ఏళ్ల యువ వైద్యుడికి విజయవంతంగా జాయింట్ ప్రిజర్వేషన్ శస్త్రచికిత్స నిర్వహించారు.
హెచ్‌టీవోతో పాటు ఆటోలాగస్ కాన్డ్రోసైట్ ఇంప్లాంటేషన్ (ఏసీఐ) ద్వారా దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగా, రోగి వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డా. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి మోకాలి నొప్పికి క్నీ రీప్లేస్‌మెంట్ అవసరం లేదని, ప్రారంభ దశలో సరైన పరీక్షలు చేసి జాయింట్ ప్రిసర్వేషన్ చికిత్సలు అందిస్తే సహజ మోకాలిని 10 నుంచి 20 సంవత్సరాల వరకు కాపాడుకోవచ్చని తెలిపారు.
మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్ డా. శరత్ రెడ్డి మాట్లాడుతూ, దేశీయంగా తయారైన హెచ్‌టీవో ఇంప్లాంట్ అందుబాటు ధరల్లో ప్రపంచస్థాయి చికిత్సను అందించడంలో కీలకమని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ మాజీ అధ్యక్షుడు ప్రొ. జి.వి.ఎస్. మూర్తి ఈ ఆవిష్కరణ భారత ఆర్థోపెడిక్ రంగానికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు.






