రైలు పట్టాలు దాటేదెలా?
- ఇంటికన్నె రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఇక్కట్లు
- అసంపూర్తిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్
కేసముద్రం, ఆగస్టు 9 (విజయక్రాంతి): కాజీపేట డోర్నకల్ రైల్వే సెక్షన్ లోని ఇంటికన్నె రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు అసంపూర్తిగా వదిలేసారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టేషన్లో గతంలో రెండు రైల్వే లైన్లు ఉండగా, ఇటీవల మూడో లైన్ వినియోగంలోకి వచ్చింది. మూడు ప్లాట్ఫారాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికులు రైలు పట్టాలు దాటేందుకు కొత్తగా గత ఏడాది ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అయితే ఏడాది దాటినప్పటికీ ఫుటు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయకపోవడంతో ప్రయాణికులు రైల్వే ట్రాక్ దాటేందుకు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పట్టాలు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు రైల్వే లైన్లలో ఎప్పుడు ఏ వైపు నుంచి రైలు వస్తుందో తెలియక అటు వరంగల్ వైపు, ఇటు మహబూబాబాద్ వైపు వెళ్లే రైళ్లు ఎక్కడానికి ప్రయాణికులు రైలు పట్టాలు దాటడం ప్రాణ సంకటంగా మారిందని చెబుతున్నారు. రైలు ప్రయాణికులకు ఒకవైపు బుకింగ్ కౌంటర్ ఉండడం వల్ల మహబూబాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులకు కొంత ఇబ్బంది లేకపోయినప్పటికీ అలంకాని పేట వైపు నుంచి వచ్చే ప్రయాణికులు 1వ నంబర్ ప్లాట్ఫారం వైపు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే వరంగల్ వైపు వెళ్లే ప్రయాణికులు 2,3 ప్లాట్ ఫారాల వైపు వెళ్లడానికి కూడా రైలు పట్టాలు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో రైలు పట్టాలు దాటేందుకు అనునిత్యం ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఇక వృద్ధులు, పిల్లలు, మహిళలు రైలు పట్టాలు దాటడం కష్టంగా మారిందని వాపోతున్నారు.
ఇటీవల రైళ్ల వేగం మరింత పెరగడంతో రెప్పపాటు కాలంలో వస్తున్నాయని, గతంలో అనేకసార్లు ఇక్కడ ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు జరిగాయని, రైలు పట్టాలు దాటడం ప్రయాణం ప్రాణాంతకంగా మారిందని చెబుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే అసంపూర్తిగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు. అలాగే ప్లాట్ఫారం అభివృద్ధి పనులను పూర్తిచేయాలని, ప్రయాణికులకు రైల్వే స్టేషన్లో కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.






