అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా హోటళ్లు
- ఇష్టారాజ్యంగా హోటల్ యజమానుల వ్యవహరణ
సమగ్ర సమాచారం తీసుకోకుండానే హోటల్లో ఆశ్రయం కల్పిస్తున్న యాజమాన్యాలు
పోలీసులు ప్రత్యేక నిఘా పెంచి అడ్డుకట్ట వేయాలని స్థానికుల విజ్ఞప్తి
ముషీరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతం లోని హోటళ్లు, లాడ్జింగ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ప్రతిరోజు నగర నలుమూలలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ కు వచ్చిపోయే వారు హోటళ్లను ఆశ్రయిస్తూ తమ కార్యకలాపాలను యదేచ్చగా సాగిస్తున్నారు. అంబర్ పేట నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్లో దాదాపు 30 హోటళ్లు ఉన్నాయి.
అందులో ప్రధానంగా కాచిగూడ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో గల హోటల్ అభినందన్ గ్రాండ్స్ లో ప్రతిరోజు జంటలు జంటలుగా చేరుకొని యదేచ్చగా అసాంఘిక కార్యకారపాలకు పాల్పడుతున్నారని సర్వత్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. సంబంధిత హోటల్ యజమానులు మాత్రం హోటల్‌కు వచ్చే యువతీ యువకుల అడ్రస్‌లు సమగ్రంగా సేకరించకుండా విచ్చలవిడిగా రూమ్‌లను బుక్ చేస్తూ వారికి ఆశ్రయాలు కల్పిస్తున్నారటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పవచ్చు.
ఇతర రాష్ట్రాల నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రాత్రి వేళల్లో హోటల్లో ఉం డాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరం లోనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తుండడంతో స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
స్థానికులు తమ కుటుంబ సభ్యు లతో లంచ్, డిన్నర్ చేసుకోవడానికి హోటల్ కు రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీసులు కాచిగూడ డివిజన్లోని హోటళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి హోటళ్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక నిఘా పెంచి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




