ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి
- ఉద్యాన యూనివర్సిటీ ఉపకులపతి డా. దండ రాజిరెడ్డి పిలుపు
గజ్వేల్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని సుమారు ఒక లక్ష ఎకరాల నుంచి ఐదు లక్షల ఎకరాలకు పెంచాల్సిన అవసరం ఉందని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. దండ రాజిరెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హూగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేసిన సందర్భంగా, ములుగు కేంద్రంగా ఉన్న ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులతో ప్రత్యేక పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డా. రాజిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి గ్రామాన్ని మోడల్ హార్టికల్చర్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉద్యాన పంటల ఉత్పాదకత పెంపు, నాణ్యమైన దిగుబడుల సాధన, ఆధునిక సాగు పద్ధతుల అమలులో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకు పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. గ్రామాల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తామన్నారు. విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పురుగు, తెగుళ్ల నివారణ, నేల ఆరోగ్య పరిరక్షణ, పోషక పదార్థాల సమతుల్య వినియోగం, సమగ్ర పంట నిర్వహణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు తమ సమస్యలను శాస్త్రవేత్తల దృష్టికి తీసుకురాగా, వాటికి తగిన సాంకేతిక పరిష్కారాలను సూచించారు.






