22 June, 2026 | 3:00 AM

తమిళనాడులో ఘోర విషాదం

22-06-2026 01:37 AM

రొయ్యల పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీక్

ఏడుగురు మహిళా కార్మికులు మృతి

చెన్నై, జూన్ 21: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాలెం సమీపంలో భారీ విషాదం చోటుచేసుకుంది. కన్నిగైపైర్‌లోని ‘సెయింట్ పీటర్స్ అండ్ పాల్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్’ రొయ్యల పరిశ్రమలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు అమ్మోనియా గ్యాస్ లీకైంది.

ఈ ఘటనలో ఏడుగురు మహిళా కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనా స్థలాన్ని స్థానిక కలెక్టర్ సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

బాధిత కార్మికులను పరామర్శించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పరిశ్రమ యజమానితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ప్రాసెసింగ్ యూనిట్‌లో అమర్చిన మేజర్ వాల్వ్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభు త్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చా రు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సంబంధిత మంత్రులను ఆదేశించారు.