22 June, 2026 | 4:06 AM

బొగ్గు చోరీకి గురైందనడం అవాస్తవం

22-06-2026 02:18 AM

సింగరేణి యాజమాన్యం 

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): సింగరేణి బొగ్గు చోరీకి గురైందని, కనిపించడం లేదంటూ కొన్ని మీడియా సంస్థల్లో ఇటీవల వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆదివారం ప్రకటనలో స్పష్టం చేసింది. సంస్థ లో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా, విక్రయాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు అత్యం త పారదర్శకంగా, ఆధునిక సాంకేతిక వ్యవస్థ ల పర్యవేక్షణలో జరుగుతున్నాయని పేర్కొం ది. గనుల్లో బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతి దశ డిజిటల్‌గా నమోదవుతోందని పేర్కొంది.

బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, మిగిలిన 15 శాతం రోడ్డు మార్గం ద్వారా సరఫరా అవుతుందని వివరించింది. బొగ్గు కేటాయింపులు ఎస్‌ఏపీ ఆధారిత సమగ్ర వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయని, వినియోగదారుడు, గని, పరిమాణం, సరఫరా తేదీ తదితర వివరాలు ముందుగానే డిజిటల్‌గా నమోదవుతాయని తెలిపింది. ప్రతి టన్ను బొగ్గుకు సంబంధించిన సమాచారం కోల్ నెట్, ఎస్‌ఏపీ, ఇతర ఆన్‌లైన్ వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని సింగరేణి ఆపరేషన్స్ విభాగం ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేసే ప్రతి వాహనం ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్‌ల వద్ద తూకం జరుగుతుందని, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత బూమ్ బ్యారియర్లు, జీపీఎస్/జీపీఆర్‌ఎస్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్ వ్యవస్థల ద్వారా వాహనాల కదలికలపై రియల్ టైమ్‌లో పర్యవేక్షణ కొనసాగుతోందని ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

రైల్వే మార్గంలో కూడా ప్రతి వ్యాగన్ లోడింగ్, డిస్పాచ్ వివరాలు డిజిటల్‌గా నమోదవుతున్నాయని, గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు, వే బ్రిడ్జ్‌లు, రైల్వే సైడింగ్‌లు, స్టాక్ యార్డులు, ఎంట్రీ- పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు, ఆర్‌ఎఫ్‌ఐ వ్యవస్థలు, చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, భద్రతా సిబ్బంది 24 గంటలూ పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు బొగ్గు రవాణా విభాగం ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీలు, ప్రత్యేక గస్తీలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇంత పకడ్బందీగా జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి-రవాణా ప్రక్రియలో బొగ్గు చోరీకి గురికావడం, కనిపించకపోవడం వంటి ఆరోపణలు అవాస్తవమని సింగరేణి యాజమాన్యం పేర్కొంది.