22 June, 2026 | 4:06 AM

దయనీయం.. ఉస్మానియా ఆస్పత్రి

22-06-2026 02:19 AM
  1. పౌరుల ఆరోగ్య హక్కు, మానవ గౌరవానికి భంగం 
  2. తాగునీటి సంక్షోభం.. నర్సులు, వైద్యుల కొరత  
  3. పేద రోగులపై ప్రభుత్వ వైఫల్యాల భారం
  4. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి
  5. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు మానవ హక్కుల వేదిక లేఖ

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది పేద, వెనుకబడిన వర్గాల రోగులకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో ప్రజా ఆరోగ్య సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ ఆదివారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు హెచ్‌ఆర్‌ఎఫ్ తెలంగాణ అండ్ ఏపీ సమన్వయ కమిటీ సభ్యులు ఎస్‌జీవన్‌కుమార్, సిటీ యూనిట్ ఉపాధ్యక్షుడు సయ్యద్ బిలాల్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ లేఖ రాశారు.

హెచ్‌ఆర్‌ఎఫ్ నిజనిర్ధారణ కమిటీ ఇటీవల ఆస్పత్రిని సందర్శించి రోగులు, వారి సహాయకులు, వైద్యులు, నర్సులు, ఆర్‌ఎంఓలతో మాట్లాడినట్లు తెలిపారు. అక్కడ ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు పూర్తిగా కుప్పకూలిన పరిస్థితులు కనిపించాయని పేర్కొన్నారు. ఇవి కేవలం పరిపాలనా వైఫల్యాలు మాత్రమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్- 21 ప్రకారం ప్రతి పౌరుడికి కల్పించాల్సిన ఆరోగ్య హక్కు, మానవ గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతిరోజూ సుమారు 2 వేల మంది రోగులు ఆస్పత్రిని సందర్శిస్తుండగా, 60 నుంచి 80 మంది వరకు అడ్మిట్ అవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రతి రాత్రి ప్రమాద బాధితులు, ఆత్మహత్యాయత్నాలు చేసినవారు, కత్తిపోట్లకు గురైనవారు, వివిధ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డులకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణతో పాటు కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గా, మహారాష్ట్రలోని పర్భని, అకోలా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్ ప్రాంతాల నుంచి కూడా పేద రోగులు చికిత్స కోసం ఉస్మానియాపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. 

తాగునీటి కోసం అవస్థలు.. సిబ్బంది కొరత

ఆస్పత్రిలో తీవ్ర తాగునీటి సంక్షోభం నెలకొందని హెచ్‌ఆర్‌ఎఫ్ ప్రతినిధులు వెల్లడించారు. బోరు బావి ఎండిపోవడంతో పాటు మున్సిపల్ నీటి సరఫరా కూడా గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ప్రైవేట్ విక్రేతల నుంచి నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిలోనే నీటి కోసం డబ్బులు చెల్లించాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.

ఆస్పత్రిలో నర్సులు, వైద్యుల కొరత తీవ్రంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల సుమారు 60 మంది స్టాఫ్ నర్సులను బదిలీ చేయగా, వారి స్థానంలో కేవలం 30 మందిని మాత్రమే నియమించారని తెలిపారు. ప్రస్తుతం కనీసం మరో 40 మంది నర్సులు అత్యవసరంగా అవసరమని సిబ్బంది చెప్పినట్లు వెల్లడించారు. పలు విభాగాలు తగినంత మంది సిబ్బంది లేకుండానే నడుస్తున్నాయని, రోగుల భారాన్ని దృష్టిలో ఉంచుకుంటే కనీసం 10 మంది వైద్యులను వెంటనే నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన చర్యలు

ఆస్పత్రికి తగినంత తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలి. వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బందిని అత్యవసరంగా నియమించాలి. పడకల సామర్థ్యాన్ని, ఇన్ పేషెంట్ సౌకర్యాలను విస్తరించాలి. సీటీ స్కాన్ యంత్రాన్ని మరమ్మతు చేయాలి. ఆస్పత్రి మౌలిక సదుపాయాలు, వైద్య సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలి. ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవాలి. 

నేలపైనే రోగులకు చికిత్స

పడకల కొరత కారణంగా రోగులు నేలపై, కారిడార్లలో పడుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల గౌరవం, గోప్యత, సరైన వైద్య సేవలు అన్నీ దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఇది ఏ నాగరిక సమాజంలోనూ ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా ఆస్పత్రిలోని సీటీ స్కాన్ యంత్రం పనిచేయడం లేదని, దీంతో రోగులను గాంధీ ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలకు పంపుతున్నారని తెలిపారు.

అయితే ఇటీవల అక్కడ కూడా సీటీ స్కాన్ యంత్రాల్లో సమస్యలు తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన వైద్య సేవలు అందించడం కష్టంగా మారిందని స్వయంగా ఆర్‌ఎంఓ కమిటీకి తెలిపినట్లు వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రిలోని పరిస్థితులు తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగం ఎదుర్కొంటున్న పెద్ద సంక్షోభానికి అద్దం పడుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఈ వైఫల్యాల భారాన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందలేని పేద రోగులే భరిస్తున్నారని పేర్కొన్నారు. పేద రోగులకు మానవీయ వైద్య సేవలు అందకపోవడం కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాకుండా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని హెచ్‌ఆర్‌ఎఫ్ పేర్కొంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, పౌరసమాజ సంస్థలు, ప్రజల ముందుకు ఈ అంశాన్ని తీసుకెళ్తామని హెచ్చరించింది.