22 June, 2026 | 3:02 AM

పేదల పొట్ట కొట్టొద్దు

22-06-2026 01:40 AM
  1. ఉపాధిహామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగింపు సరికాదు
  2. ఇది దేశ చరిత్రను అవమానించడమే 
  3. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
  4. తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుంది
  5. వీబీ -జీ రామ్- జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
  6. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్-జీ) చట్టం దేశంలోని కోట్లాది గ్రామీణ పేదల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైనదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శిం చారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాల యంలో నిర్వహించారు. క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి దాన కిశోర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ పేదలకు కల్పించిన హక్కులను క్రమంగా నిర్వీర్యం చేసి, రాష్ట్రాల అధికారాలను హరించేందుకు కేంద్రం కుట్రపూరితంగా కొత్త చట్టాన్ని తీసుకువస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం కేవలం ఒక పథకం కాదని, అది గ్రామీణ భారతదేశానికి ఆర్థిక భరోసా కల్పించిన సామాజిక విప్లవమని చెప్పారు. అలాంటి చట్టాన్ని బలహీనపరచడం అంటే రైతులు, కూలీలు, మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవితాలతో ఆటలాడటమే అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా రాష్ట్రాల పాత్రను తగ్గించి, అన్ని అధికారాలను ఢిల్లీ చేతుల్లో కేంద్రీకరించాలనే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు.

దేశ స్వాతంత్య్ర సమరానికి మార్గదర్శకుడైన మహాత్మా గాంధీ పేరును తొలగించడం కేవలం పేరు మార్పు కాదని, అది భారతదేశ చరిత్రను, జాతిపిత వారసత్వాన్ని అవమానించే చర్య అని మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపుతో చరిత్రను చెరిపివేయాలని ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం అని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ నాయకత్వంలో, రాజీవ్ గాంధీ కలల సాకారంగా రూపుదిద్దుకున్న ఉపాధి హామీ చట్టం గ్రామీణ భారతదేశంలో కోట్లాది కుటుంబాలకు రక్షణ కవచంగా నిలిచిందన్నారు.

కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన ప్రధాన కార్యక్రమం ఇదేనని గుర్తు చేశారు. వీబీ-జీ రామ్-జీ చట్టం అమల్లోకి వస్తే గ్రామీణ కార్మికులు, చిన్న సన్నకారు రైతులు, మహిళా సంఘాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడటంతో పాటు గ్రామీణ పేదలకు అందుతున్న ఉపాధి, జీవనోపాధి భద్రత దెబ్బతింటుందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పేదల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేసిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ప్రస్తుత ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ చట్టాన్ని యథాతథంగా కొనసాగిస్తూ ప్రతిపాదిత వీబీ-జీ రామ్-జీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ భారతదేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైతే ఇతర రాష్ట్రాలతో కలిసి పోరాటం చేపట్టేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.