22 June, 2026 | 3:01 AM

జల ముప్పు!

22-06-2026 01:51 AM

కృష్ణా అప్పర్ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల విస్తరణకు కర్ణాటక వేగంగా అడుగులు

  1. నూతన ప్రాజెక్టుల ప్రతిపాదనలు ముందుకు 
  2. తెలంగాణ నీటి వాటాకు విఘాతం కలిగే ప్రమాదం 
  3. పాలమూరు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులపై ప్రభావం
  4. రాష్ట్రం స్పందించడం లేదంటున్న విపక్షాలు
  5. కఠినంగా వ్యవహరించాలంటున్న నిపుణులు

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి) : కర్ణాటక ప్రభు త్వం అప్పర్ కృష్ణా, భద్ర, భీమా ప్రాజెక్టుల ఎత్తు పెంపు, రిజర్వాయర్ల  విస్తరణ.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి  హక్కులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎగువన నీటిని మళ్లించ డ వల్ల మన ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికే నావలి రిజర్వా యర్  విస్తరణ, ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు, అప్పర్ భద్ర ప్రాజెక్టు, తుంగభద్రపై కొత్తగా నీటి నిల్వ సామర్థ్యాల సృష్టి వంటి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇవన్నీ కృష్ణా నదిలోకి వచ్చే నీటి ప్రవాహాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నీటిపారుదల రంగం నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ భౌగోళికంగా కృష్ణా జలాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు  సాగు, తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. పాలమూరు- కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ వంటి పథకా లు కూడా శ్రీశైలం జలాశయం నీటి లభ్యతపైనే ఆధారపడి ఉంటాయి. అలాంటి పరిస్థి తుల్లో ఎగువ రాష్ట్రాలు భారీ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపట్టడం తెలంగాణకు సవాల్‌గా మారుతోంది.

వ్యూహాత్మకంగా ‘నావలి’ విస్తరణ

తుంగభద్ర డ్యామ్‌లో పూడిక పెరగడం, నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం, వరద ప్రవాహాల్లో మార్పులు రావడం వంటి కారణా లను చూపుతూ కర్ణాటక ప్రభుత్వం నావలి రిజర్వాయర్‌ను విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచి, దానిని తుంగభద్ర డ్యాంకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగించాలని భావిస్తోంది. ఇది కేటాయించిన జలాల ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి అవసరమైన చర్యగా కర్ణాటక వాదిస్తు న్నది.

అయితే ఎగువన నిల్వ సామర్థ్యం పెరిగితే సహజంగా దిగువ ప్రాంతాలకు చేరే ప్రవాహాలు తగ్గుతాయని, భవిష్యత్తులో తుంగభద్ర నుంచి కృష్ణాలోకి వచ్చే నీటి పరిమాణం క్రమంగా క్షీణించే ప్రమాదం ఉందని తెలంగాణ ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర, భీమా నదులపై కర్ణాటక ప్రతిపాదిస్తున్న బరాజ్‌లు ఒక్కొక్కటి పెద్ద ప్రాజెక్టులుగా కనిపించకపోయినా, వాటి ప్రభావం గణనీయంగా ఉండే అవకాశముంది.

నదీ ప్రవాహాలకు  వివిధ ప్రాంతా ల్లో అడ్డుకట్ట వేయడం వల్ల నీటి వినియోగం కూడా పెరుగుతుంది. ప్రత్యేకించి కృష్ణా- సంగమ ప్రాంతానికి ఎగువన ప్రతిపాదిస్తున్న నిర్మాణాలు భవిష్యత్తులో దిగువ రాష్ట్రాలకు అందే నీటి పరిమాణంపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జలాలపై మూడు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు వివాదాలను మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అటు కర్ణాటక.. ఇటు ఏపీ

కర్ణాటక ప్రణాళికల్లో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశమే అత్యంత కీలకమైనది. ప్రస్తుతం ఉన్న నీటి మట్టాన్ని మరింత పెంచి అదనపు నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాలన్న లక్ష్యంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం భారీస్థాయిలో భూసేకరణ, వేల కోట్ల రూపాయల వ్యయం చేయడానికి సిద్ధమవుతోంది. ఆల్మట్టి నిల్వ సామర్థ్యం పెరగడం అంటే ఎగువన మరిం త నీరు నిల్వ కావడం. దీని ప్రభావం శ్రీశై లం, నాగార్జునసాగర్ వంటి దిగువ జలాశయాలపై పడే అవకాశం ఉందని తెలంగాణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యంగా వర్షాభావ సంవత్సరాల్లో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నాయి. కేవలం కర్ణా టక చర్యలే కాకుండా, ఆంధ్రప్రదేశ్ కూడా వరద జలాల వినియోగం పేరుతో పలు ప్రాజెక్టులను ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎగువ రాష్ట్రం కర్ణాటక, దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండూ తమ అవసరాలకు అనుగుణంగా జల వనరులను విని యోగించుకునే ప్రయత్నాలు చేస్తుండగా, తెలంగాణ తన హక్కులను ఎంత బలంగా వినిపిస్తుందన్నది కీలక ప్రశ్నగా మారింది.

వ్యూహాత్మక సవాల్.. 

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ముందున్న అసలు సవాలు రాజకీయాల కంటే ఎక్కువగా వ్యూహాత్మకమైనది. ఎగువ రాష్ట్రాలు తమకు కేటాయించిన జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తుండగా, తెలంగాణ కూడా తన చట్టబద్ధ హక్కులను కాపాడుకునేందుకు సాంకేతిక, న్యాయ, పరిపాలనా స్థాయిలో సమర్థవంతమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో వాతావరణ మార్పులు, తగ్గుతున్న వర్షపాతం, పెరుగుతున్న నీటి అవసరాల నేపథ్యంలో కృష్ణా నదిపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా పరిశీలించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జలవనరుల నిపుణులు సూచిస్తున్నారు.  

తెలంగాణ సర్కార్ తీరుపై విమర్శలు

కృష్ణా జలాల అంశంలో కర్ణాటక తాజా ప్రతిపాదనలతో వేగంగా ముందుకెళ్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఆశించినస్థాయిలో స్పందించడం లేదనే విమర్శ లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నావలి రిజర్వాయర్ విస్తరణ, ఆల్మట్టి ఎత్తు పెంపు, తుంగభద్రపై కొత్త ప్రాజెక్టులు, కృష్ణా నదులపై బరాజ్‌ల నిర్మానం వంటి ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగా గట్టి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

గతంలో బీఆర్‌ఎస్ ప్రభు త్వం ట్రిబ్యునల్ తుది అవార్డు అమల్లోకి వచ్చే వరకు ఎటువంటి విస్తరణ పనులు చేపట్టరాదని స్పష్టం గా చెప్పిన విషయం గుర్తుచే స్తున్నా యి. దీనిపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి, కేఆర్‌ఎంబీకి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లేఖలు కూడా రాసింది. ప్రస్తుత ప్రభుత్వం చర్చలు, సంయుక్త కమిటీలు, పరస్పర సంప్రదింపులవైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే  ఉండటంతో రాజకీయంగా తెలంగాణ సర్కార్ సాను కూల వైఖరి అవలంభిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక నాయకు లతో సమావేశాలు, చర్చలకు సానుకూ లంగా స్పందించడం కూడా ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.

తెలంగాణ వ్యవసా యం, తాగునీటి అవసరాలు, సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు కృష్ణా జలాలతో ముడిపడి ఉన్నందున ప్రభుత్వం మరింత స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సాగునీటి నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే అవకాశమున్న అంశాలపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయప డుతున్నారు.