అమోనియా లీకేజీ ఘటనపై స్పందించిన సీఎం విజయ్
తమిళనాడు: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని పెరియపాళయం సమీపంలో కన్నిగైపైర్ వద్ద ఉన్న సెయింట్ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అమ్మోనియా వాయువు లీక్ అయిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. అమ్మోనియా లీక్ ఘటనపై విచారణ జరిపేందుకు, ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఆదివారం ఆదేశించారు. పారిశ్రామిక భద్రత, ఆరోగ్య శాఖ డైరెక్టర్, తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ అదనపు డైరెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు తమ మధ్యంతర నివేదికను 24 గంటల్లోపు, తుది నివేదికను మూడు రోజుల్లో సమర్పించాలని సూచించారు.
బాధితులకు సాధ్యమైనంత సంరక్షణను అందించాలని, జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సమాచార సాంకేతికత, డిజిటల్ సేవల శాఖ మంత్రి ఆర్.కుమార్, తిరువళ్లూరు జిల్లా పర్యవేక్షణాధికారి కెపి కార్తికేయన్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. సంస్థల డీన్‌లతో సమన్వయ ప్రయత్నాలను పర్యవేక్షించేందుకు, ప్రజా పనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున, పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌లను స్టాన్లీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు హుటాహుటిన వెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ఈ ఘటనలో మరణించిన వారికి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సంతాపం తెలిపారు. ఈ దురదృష్టకరమైన విషాదంలో బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం, స్థైర్యం లభించాలని తను ప్రార్థిస్తున్నాని, చికిత్స పొందుతున్న వారందరూ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాని ఆయన అన్నారు.






