22 June, 2026 | 3:18 AM

లెబనాన్‌పై దాడులు ఆపాల్సిందే!

22-06-2026 01:40 AM

ఇజ్రాయెల్ వైఖరిపై ఇరాన్ బృందం అభ్యంతరాలు

అమెరికా చొరవ తీసుకుని దాడులు ఆపాలని డిమాండ్

స్విట్జర్‌ల్యాండ్ వేదికగా శాంతిచర్చలు 

పాక్ ప్రధాని షరీఫ్, ఖతార్ ప్రధాని అబ్దుల్ రెహమాన్ మధ్యవర్తిత్వం 

బెర్న్, జూన్ ౨౧: లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైనిక దళాలను ఉప సంహరించుకోవాల్సిందేనని, ఎట్టిపరిస్థితుల్లోనూ దాడులు ఆపాల్సిందేనని ఇరాన్ బృందం తేల్చిచెప్పింది. అమెరికా చొరవ తీసుకుని లెబనాన్‌పై దాడులు నిలిచిపోయేలా చూడాలని డిమాండ్ చేసింది. శాంతిచర్చలు మొదలు కావాలంటే ముందుగా తాము విధించిన షరతును అమలు చేయాలని పట్టుబట్టింది.

స్విట్జర్‌ల్యాండ్‌లోని బర్గన్‌స్టాక్ హోటల్‌లో ఆదివారం పాకిస్థాన్ షరీఫ్, ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ ప్రతినిధి బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో ట్రంప్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ హాజరయ్యారు.

మొదటి రౌండ్ చర్చలు 80 నిమిషాలపాటు సాగాయి. ఈ విడతలో ఇరాన్ అణు పరీక్షల ప్రస్తావన రాలేదు. కేవలం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులపైనా ప్రధానంగా చర్చ జరిగింది. ఆ తర్వాత అంతర్గత సంప్రదింపుల కోసం చర్చలకు విరామం ప్రకటించారు. మొదటి రౌండ్ చర్చల విరామం తర్వాత ఇరాన్, ఖతార్ ప్రతినిధులు విడిగా సమావేశమయ్యారు. రెండో విడత చర్చల్లో ఇరాన్ అణు పరీక్షలు, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశాలపై చర్చలు జరుగుతాయని సమాచారం.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చల ప్రారంభంలో పాకిస్థాన్ ప్రధాని షరీఫ్‌ను ఆలింగనం చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాత్రం ఎలాంటి సంభాషణ జరుపలేదు. అమెరికా ప్రతినిధులతో సంయుక్తంగా ఫొటోలు దిగేందుకు ఇరాన్ బృందం ఏమాత్రం ఆసక్తి చూపలేదు. సున్నితంగా ఆ అభ్యర్థనను ఇరాన్ బృందం తిరస్కరించింది. చర్చల ప్రారంభానికి ముందు జేడీ వాన్స్ మాట్లాడుతూ హోర్ముజ్ జలసంధిని తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమానికి ముగింపుపై చర్చలు సాగుతాయని చెప్పుకొచ్చారు.

లెబనాన్‌లో ప్రాక్సీలను నిలువరించాలి: ట్రంప్

స్విట్జర్‌ల్యాండ్‌లో శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం చర్చలను ప్రభావితం చేసింది. లెబనాన్‌లో ముందుగా ఇరాన్ ప్రాక్సీలను నిలువరించాలని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’లో పోస్టు పెట్టారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతినిధులు భగ్గుమన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.