5 July, 2026 | 11:48 AM

ఉపాధ్యాయుల వ్యక్తిత్వమే విద్యార్థులకు తొలి పాఠం

05-07-2026 11:32 AM

* ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించాలి

* ఎంఈఓ చత్రు నాయక్

గరిడేపల్లి,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల వ్యక్తిత్వమే విద్యార్థులకు తొలిపాటమని విద్యాశాఖ అధికారి చత్రు నాయక్ అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందరూ ఫార్మల్ డ్రెస్ కోడ్ ను పాటించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు టీ షర్టులు, జీన్స్, టోపీలు ధరించి విధులకు హాజరు కావద్దన్నారు.

మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ చీరలోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుడి వ్యక్తిత్వమే విద్యార్థికి తొలి పాఠం అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, భారతీయ సంస్కృతి, వృత్తి గౌరవాన్ని పెంచే దిశగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. మండల విద్యాధికారి తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.