5 May, 2026 | 3:51 AM

ఐపీఎల్ బ్లాక్ టికెట్ల ముఠా అరెస్ట్

05-05-2026 02:28 AM

నకిలీ లెటర్ హెడ్స్‌తో టికెట్లు 

జడ్జీలు, మంత్రులు, గవర్నర్ సంతకాల ఫోర్జరీ

మేడ్చల్, మే 4 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో భారీ ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా బయటపడింది. నకిలీ లెటర్ హెడ్స్‌తో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి టికెట్లు పొంది బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్‌సీఏ సెక్రటరీ ఇచ్చిన సమాచారంతో ఆపరేషన్ నిర్వహించిన మల్కాజ్‌గిరి సీపీ సుమతి ఆధ్వర్యంలో స్పెషల్ ఎస్‌వోటీ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

పక్కా సమాచారంతో స్టేడియం దగ్గర వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు పల్కూరు గ్రామానికి చెందిన గట్టమనేని అశోక్, కంకనాల దినేశ్, సింగమనేని వేణుమాధవ్ ముఠాగా ఏర్పడి సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ దందా మొదలుపెట్టారు.

దీని కోసం జడ్జీలు, మంత్రులు, గవర్నర్‌లకు చెం దిన నకిలీ లెటర్ హెడ్స్ తయారుచేసి వాటి సాయంతో టికెట్లు పొందారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ అసోసియేషన్ లెటర్ హెడ్స్ సైతం తయారు చేసారు. వాటి సాయంతో ఖరీదైన కార్పొరేట్ కాంప్లెమెంటరీ పాసులు పొంది అమ్మ డం మొదలుపెట్టారు. దీనిపై అనుమానం వచ్చిన హెచ్‌సీఏ పోలీసులకు సమాచారమివ్వడంతో వీరి గుట్టు రట్టయింది. నిందితుల దగ్గర నుంచి రూ.1,10,000 విలువైన ఐపీఎల్ టికెట్లు, మహీంద్రా థార్ వాహనం,  5 మొబైల్ ఫోన్లు, 5 ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.