గుట్టలు గుల్ల..!
- కేశవరం కొండలను కొల్లగొడుతున్న అక్రమ తవ్వకాలు
- ప్రకృతి సంపదకు ముప్పు.. ప్రభుత్వ ఖజానాకు గండి..
- ధూళి కాలుష్యంతో గ్రామస్తుల అవస్థలు
- ప్రేక్షకపాత్రలో మైనింగ్, రెవెన్యూ శాఖలు
అయిజ, జూన్ 8 : అయిజ మండలం కేశవరం గ్రామ పరిధిలోని గుట్టలపై మట్టి మాఫియా కన్ను పడింది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే భారీ జేసీబీలు, పొక్లెయిన్లతో రాత్రింబవళ్లు తవ్వకాలు జరుపుతూ గుట్టలను గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ తవ్వకాల దందా రోజురోజుకు మరింత విస్తరిస్తోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర గుట్టల నుంచి ప్రతిరోజూ వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా కొందరు ప్రభావశీలుల అండదండలతో ఈ వ్యాపారం నిరాటంకంగా సాగుతోందని ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాల కారణంగా కొండల స్వరూపం మారిపోతోందని, భవిష్యత్తులో గుట్టల ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతి సంపద దోపిడీ.. ఆదాయానికి గండి
గుట్టల నుంచి భారీ ఎత్తున మట్టిని తరలించడం వల్ల ప్రకృతి సంపద నాశనమవుతుండటంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ, సీనరేజ్ ఆదాయం కూడా కోల్పోతున్నట్లు తెలుస్తోంది. అక్రమ తవ్వకాల ద్వారా కొందరు వ్యక్తులు లక్షలు, కోట్ల రూపాయలు సంపాదిస్తుండగా ప్రభుత్వ ఖజానాకు మాత్రం భారీ నష్టం వాటిల్లుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ధూళి దుమారంలో కేశవరం
నిత్యం వందలాది టిప్పర్లు గ్రామ రహదారులపై సంచరిస్తుండటంతో రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి. లారీల నుంచి ఎగిసిపడుతున్న ధూళి కారణంగా గ్రామంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందని ప్రజలు వాపోతున్నారు. చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అతివేగంగా వెళ్తున్న భారీ వాహనాల కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.
చూసీ చూడనట్లు అధికారులు..!
ఇంత పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కళ్లముందే గుట్టలు మాయమవుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే మట్టి మాఫియాకు అండగా మారిందని ఆరోపిస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని, వెంటనే అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేశవరం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో గుట్టలు కనుమరుగై పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.






