‘హీరా గోల్డ్’ నౌహీరా మళ్లీ అరెస్టు
- హర్యానాలోని గుర్గావ్‌లో అదుపులోకి తీసుకున్న ఈడీ
- కోర్టులో హాజరు, నిందితురాలికి రిమాండ్
- గోల్డ్ కుంభకోణంలో నౌహీరా షేక్ ప్రధాన నిందితురాలు
ఢిల్లీ, మే 22: డిపాజిటర్లను మోసం చేసిన కేసులో హీరా గ్రూప్ అధినేత నౌహీ రా షేక్‌ను ఈడీ మళ్లీ అరెస్టు చేసింది. హర్యానాలోని గుర్గావ్‌కు పరారైన నిందితురాలిని సాంకేతిక ఆధారాలతో గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అక్కడి పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి గురువారం అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం ఆమెను హైదరాబాద్‌లోని కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం నిందితురాలికి రిమాండ్ విధించింది. హీరా గోల్డ్ పెట్టుబడుల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నౌహీరా షేక్‌ను గతంలో ఈడీ అరెస్టు చేయగా బెయిల్‌పై బయటకొచ్చిన విషయం తెలిసిందే.
కేసు వివరాలు ఇలా..
హీరా గోల్డ్ కుంభకోణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ రాష్ట్రాల్లో దాదాపు 1.72 లక్షల మంది నుంచి సుమా రు రూ.5,600 కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల మేర డిపాజిట్‌లు సేకరించి మోసం చేసినట్లు ఆ సంస్థ ఎండీ నౌహీరా షేక్ ఆరోపణలు ఎదుర్కొంది. తమ సంస్థలో పెట్టుబ డులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలను మోసం చేశారన్న ఫిర్యాదులతో నౌహీరా షేక్‌పై కేసులు నమోదయ్యాయి.
ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. డిపాజిటర్ల నుంచి సేకరించిన నగదును విదేశాలకు మళ్లించేందుకు సమకూర్చుకున్న పత్రాలు, డిజిటల్ ఆధారాలను సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. నౌహీరాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఉన్న రూ.45 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, బినామీల పేరిట ఉన్న మరో రూ.25 వేల కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
రూ.వేల కోట్ల నిధుల గోల్‌మాల్ కేసులో ఈడీ ఇప్పటికే నౌహీరా షేక్‌కు సంబంధించిన రూ.400 కోట్ల విలువైన స్థిర, చరాస్తుల ను అటాచ్ చేసి, వాటిని వేలం వేయడానికి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నౌహీరా సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 5 షరతులతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతుల్లో దేన్ని అతిక్రమించినా బెయిల్ రద్దవుతుందని అప్పట్లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ, షరతులను ఉల్లంఘించడం తో బెయిల్‌ను రద్దు చేసింది.
ఈడీ వేలంలో ఆస్తులు కొనుగోలు చేసిన వారి పేరిట వాటి ని రిజిస్ట్రేషన్ చేయించడానికి ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆమెను జైల్లో ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. వారం రోజుల్లోపు సంబంధిత జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని అప్పట్లో స్పష్టం చేసింది. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న నౌహీరాను తాజాగా ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి నౌహీరా షేక్ నకిలీ ఆధార్ కార్డు, తప్పుడు వివరాలతో గుర్గావ్‌లోని ఒక ఇంట్లో నివాసం ఉంటున్నట్లు ఈడీ విచారణలో తేలింది.






