పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): వాతావరణ నిపుణులు, క్లైమటాలజిస్టులు అందించిన నివేదికల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో 2026 జూలై 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా కంది, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, అలసంద, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు విత్తనాలు వేసేందుకు అత్యంత అనుకూల సమయమని, సకాలంలో విత్తనాలు వేయడం వల్ల నేలలో తగినంత తేమ లభించి పంటలు ఆరోగ్యంగా ఎదిగి మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఆగస్టు 10 వరకు మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ అవి చెరువులు నిండేందుకు, భూగర్భ జలాలు పెరిగేందుకు ఉపయోగపడవని, వీటిని నమ్ముకుని వరి వంటి పంటలు వేస్తే రైతులు దెబ్బతింటారని ఆరుతడి పంటల సాగుకే రైతులు మొగ్గు చూపాలని కలెక్టర్ సూచించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ఈ అనుకూల వర్షాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






