19 July, 2026 | 8:29 PM

ప్రధాని మోడీకి ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ

19-07-2026 12:37 PM

అయోధ్య రామమందిర విరాళాల చోరీ

న్యూఢిల్లీ: శ్రీరామ జన్మభూమి(Ram Janmabhoomi) తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో వేల కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress President Mallikarjun Kharge), లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి(Prime Minister Narendra Modi) సంయుక్తంగా లేఖ రాశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ మౌనం ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ, నగదు, బంగారం, వెండి సహా భక్తులు సమర్పించిన అన్ని విరాళాల నిర్వహణపై స్వతంత్ర, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. దర్యాప్తు ఫలితాలు, ట్రస్ట్ ఖాతాలను ప్రజలకు బహిర్గతం చేసి, విరాళాల వినియోగంపై పూర్తి పారదర్శకత పాటించాలని, హోదా లేదా ప్రభావంతో సంబంధం లేకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Session) ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ఈ లేఖ రాయడం విశేషం. ప్రధానమంత్రిని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, "భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పార్లమెంటులో ఈ ట్రస్ట్ ఏర్పాటును మోదీ ప్రకటించారు. కానీ దీని సభ్యులను మాత్రం పూర్తిగా మీ ప్రభుత్వమే నియమించింది. ఈ ట్రస్ట్ సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్ (RSS), వీహెచ్‌పీ (VHP), వాటి అనుబంధ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారన్న విషయం బహిరంగ రహస్యమే. దీనికి సంబంధించి అప్రతిష్ట పాలైన మాజీ ప్రధాన కార్యదర్శి కూడా మీకు అత్యంత సన్నిహితుడే." అని పేర్కొన్నారు. రామమందిరానికి సమర్పించిన విరాళాలు అపహరించబడ్డాయన్న ఆరోపణలు జూన్ మొదటి వారంలో వెలుగుచూశాయి. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎనిమిది మంది అరెస్టు కాగా, ట్రస్ట్‌కు చెందిన ఇద్దరు సీనియర్ బాధ్యులు రాజీనామా చేశారు. జూన్ 25న, ట్రస్ట్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేశారు.