29 July, 2026 | 1:45 PM

కుండపోతకు కుప్పకూలిన నివాసం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

29-07-2026 12:48 PM

కోటపల్లి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో భారీ వర్షం ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షాలకు ఆత్రం మాంతయ్య నివాస గృహం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆయన భార్య లక్ష్మి, కుమారులు అజయ్, అనిల్ శిథిలాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు.

బాధితుల అరుపులు విన్న గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి గాయపడిన ముగ్గురిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడంతో బాధిత కుటుంబం సర్వస్వాన్ని కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. ఇంట్లోని సామగ్రి సైతం ధ్వంసమై ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిసింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకుని ఆర్థిక సహాయం అందించడంతో పాటు శాశ్వత నివాసం కల్పించాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.