ఖానాపూర్‌లో గాలివాన బీభత్సం
ఎగిరిపోయిన పైకప్పు రేకులు, పడిపోయిన స్తంభాలు, రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లు
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్(Khanapur) మండలంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి 8 గంటలకు మొదలై సుమారు 40 నిమిషాలు ఏకధాటిగా గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పట్టణం మండల పరిసర గ్రామాలు అన్నిటికీ విద్యుత్ సరఫరా ఆగిపోయి చీకట్లో ఉండిపోయారు. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఒక ఇంటి పైకప్పు లేచిపోయి దూరంగా పడిపోవడంతో ఇంట్లో వస్తువులు చిందరవందరయ్యాయి. దిలావర్పూర్ మార్గంలో, మస్కాపూర్ రోడ్డుపై పలు చెట్లు నేలకు ఒరిగిపోయాయి. దీంతో ప్రధాన రహదారులైన ఈ రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. మార్కెట్ యార్డులో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. హుటాహుటిన మున్సిపల్ సిబ్బంది విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్తు పునరుద్ధరించడంలో తలమున కలవుతున్నారు.






