ధాన్యం కొనుగోళ్లలో వివక్ష
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలకు భయపడి అధికారులు నాగర్ కర్నూల్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. స్థానిక రైతుల ధాన్యాన్ని పక్కన పెట్టి కొల్లాపూర్‌కు చెందిన దళారుల లారీలకు ప్రాధాన్యం ఇస్తూ ఆన్‌లోడ్ చేయడం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి స్పందించడం లేదని మండిపడ్డారు. మంగళవారం తాడూర్ మండలం ఇంద్రకల్ గ్రామ శివారులోని మణికంఠ కాటన్ మిల్లు గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వం దళారుల వ్యవస్థకు మద్దతు ఇస్తోందని విమర్శించారు. సోమవారం మంత్రి ఆదేశాలతో అధికారులు కొల్లాపూర్‌కు చెందిన 30 లారీల ధాన్యాన్ని ఆన్‌లోడ్ చేశారని ఆరోపించారు. రైతుల పట్ల వివక్ష కొనసాగితే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతులు పండించిన పంటలో కటింగ్‌లు పెట్టి డబ్బులు దండుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. గోదాం వద్ద ఉన్న రైతులు, డ్రైవర్లకు స్వయంగా భోజనం ఏర్పాటు చేసి రైతులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






