calender_icon.png 24 February, 2026 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దంచికొట్టిన వాన

24-02-2026 01:32:17 AM

పలు జిల్లాల్లో కురిసిన వర్షం

సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు

నిర్మల్ జిల్లాలో రాళ్లవాన

పలు చోట్ల నేలకొరిగిన చెట్లు, పంటలు

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల అకాల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకొచ్చిన పసుపు తడిసి పోయింది. సిద్దిపేట జిల్లాలో సోమవారం కురిసిన అకాల వర్షంతో పలుచోట్ల ఇబ్బందులు తలెత్తాయి.

జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో పలుచోట్ల రాళ్లతో కూడిన మోస్తరు వర్షం కురవగా, సిద్దిపేట రూరల్, చేర్యాల, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. చేర్యాలలో సుమారు గంట పాటు ఏకదాటిగా కురవడంతో పట్టణంలోని గాంధీ సెంటర్, అంగడి బజార్ సెంటర్లో వర్షం నీరు నిలిచి, రహదారులు చెరువులను తలపించాయి. చిరు వ్యాపారస్తులు, వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మొక్కజొన్న, మిరప, పలురకాల కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. గ్రామాల్లో వృక్షాలు నెలకొరిగాయి. దుబ్బాక ప్రాంతంలో పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగి రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. గజ్వేల్‌లో పలుచోట్ల ఈదురుగాలులతో చెట్ల కొమ్మలు తగిలి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న గాలివానలు పంటలను దెబ్బతీస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తరిగొప్పుల, బచ్చన్నపేట, నర్మెట్ట, మహాదేవపూర్ మండ లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది.

అనేక చోట్ల పంటలు నేలవాలగా, పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. దీనితో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చేతికందే దశలో ఉన్న మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఆదివారం గాలివానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను సోమవారం వ్యవసాయ శాఖ అధికారి రాజు పరిశీలించారు.

జగత్రావుపేట, బిరవోని మండువ, రెడ్యా తండాలో 180 ఎకరాల మొక్కజొన్న పంట దెబ్బతిందని, వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంట నష్టం నివేదికను పంపినట్లు ఏవో తెలిపారు. నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాళ్లతో కురిసిన గాలివాన బీభత్సం రైతులను ప్రజలను ఇబ్బంది పెట్టింది. కుబీర్, తానూర్, లోకేశ్వరం, బైంసా, కుంటాల, సోన్, నర్సాపూర్, నిర్మల్ రూలర్ మండలాల్లో భారీ వర్షంతో పాటు రాళ్ల వర్షం కురిసింది.

ఆయా గ్రామాల్లో మిర్చి, పసుపు పంటలు తడిసి ముద్దకాగా మొక్కజొన్న, జొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి తోటలో పూత కూడా రాలిపోయింది. కాగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మాసబ్‌ట్యాంక్, అమీర్‌పేట ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.