మా స్టడీ మెటీరియల్ నుంచే 180 ప్రశ్నలు
నిరూపణ కావాలంటే ఇప్పుడే చూపిస్తా
నాసిక్ ఆర్సీసీ డైరెక్టర్ శివరాజ్ వ్యాఖ్యలు
ఓ వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్ట్
మొబైల్‌లో లీక్ అయిన ప్రశ్నాపత్రం గుర్తింపు
ల్యాప్‌టాప్, గ్యాడ్జెట్స్, కీలక పత్రాల స్వాధీనం
ముంబై, మే 18: నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసు విచారణ వేగవంతమైంది. సీబీఐ లోతైన విచారణ చేపడుతూ తాజాగా మహారాష్ట్రలోని ఒక కోచింగ్ సెంటర్ బండారం బట్టబయలు చేసింది. ప్రశ్నాపత్రంలో మా కోచింగ్ సెంటర్ రూపొందించిన స్టడీ మెటీరియల్ నుంచే 180 ప్రశ్నలు వచ్చాయి. మీకు నిరూపణ కావాలంటే ఆ ప్రశ్నలు స్టడీ మెటీరియల్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తా’ అంటూ నాసిక్‌లోని రేణుకాయ్ కెరీర్ సెంటర్ (ఆర్సీసీ) డైరెక్టర్ శివరాజ్ రఘునాథ్ మొతేగాంకర్ కొందరితో మాట్లాడిన వీడియో ఫుటేజీ ఆధారంగా సీబీఐ అధికారులు సోమవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి మొబైల్‌లో ముందే లీక్ అయిన నీట్ ప్రశ్నాపత్రాన్ని గుర్తించారు. వెంటనే స్టడీమెటీరియల్, కీలక పత్రాలు, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఇతర గ్యాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరీక్షకు ముందే అభ్యర్థుల నుంచి సొమ్ము రాబట్టుకుని, పేపర్ లీక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వెనుక పెద్ద ముఠా ఉందని సీబీఐ అనుమానిస్తున్నది. విచారణలో ముఠాను పట్టుకునే పనిలో సీబీఐ పడింది. తాజా అరెస్ట్‌తో ఈ కేసులో అరెస్టున వారి సంఖ్య ౧౦కి చేరింది.
పుణె లెక్చరర్ మనీషాపై వేటు
నీట్ ప్రశ్నాపత్రంలోని జీవశాస్త్ర ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పుణె మోడ్రన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాల అధ్యాపకురాలు మనీషా గురునాథ్ మంధారేపై సోమవారం యాజమాన్యం వేటువేసింది. ఆమెను తక్షణం విధుల్లోంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ ఉద్యోగుల నిబంధనల ప్రకారం ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
పేపర్ లీకేజీకి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. సస్పెన్షన్ నిర్ణయాన్ని పుణె విద్యాశాఖ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులకూ లిఖితపూర్వకంగా నివేదించామని వెల్లడించింది. సీబీఐ విచారణకు తమ విద్యాసంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపింది. ప్రస్తుతం నిందితురాలు 14 రోజుల సీబీఐ కస్టడీలో ఉంది. పేపర్ లీకేజీ విషయంలో ఆమె విచారణ ఎదర్కొంటున్నది.
కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ మోషన్
నీట్ యూజీ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరుపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలోని సిఫార్సులను కేంద్ర విద్యాశాఖ ఎందుకు అమలు చేయలేదని ఓ మీడియా ప్రతినిధి ఇటీవల ఆయన్ను ప్రశ్నించగా, ఆ కమిటీలో ప్రతిపక్ష సభ్యులు ఉంటారని, వారు కొన్ని విషయాలను, వారికి కావాలనుకున్నట్లు రాస్తారని వ్యాఖ్యానించారు.
దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పార్లమెంటరీ కమిటీని ఉద్దేశించి కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అవి పార్లమెంటరీ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేష్ రూల్ సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్) నోటీసు ఇచ్చారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసేలా కేంద్ర విద్యాశాఖలో లోపాలున్నాయని, ఆ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్న తరుణంలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది.
కేంద్ర ప్రభుత్వానిది ఘోర వైఫల్యం: రాహుల్‌గాంధీ
పేపర్ లీకేజీకి తావులేకుండా పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏఐసీసీ అగ్రనేత ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదని నిప్పులు చెరిగారు. అలాగే, సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపైనా రాహుల్ స్పందించారు. భాషల పేరిట విద్యార్థుల ఒత్తిడి మోపడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మతిలేని నిర్ణయాల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
నాందేడ్‌లో 8 గంటలు సోదాలు
నాందేడ్‌లో సోమవారం సీబీఐ అధికారులు సుమారు ౮ గంటల పాటు సోదాలు నిర్వహించారు. కుమార్తె కోసం రూ.౫ లక్షలు చెల్లించి నీట్ ప్రశ్నాపత్రం కొన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారావ్ కదమ్ నివాసాన్ని జల్లెడ పట్టారు. సోదాల్లో కీలక పత్రాలను, ఆర్థిక లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీల వెనుక ఉన్న దళారుల పాత్రపై లోతైన విచారణ చేపడుతున్నారు. తదుపరి విచారణ కోసం పుణె సీబీఐ కార్యాలయానికి హాజరుకావాలని కదమ్ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. రాజస్థాన్ పోలీసుల ప్రాథమిక విచారణ ఆధారంగా మొదలైన సీబీఐ విచారణ క్రమంగా మహారాష్ట్రకు చేరింది. పుణె, నాసిక్, లాతూర్, నాందేడ్ నగరాల కేంద్రంగానే లీకేజీ నెట్‌వర్క్ బయటపడుతుండటం గమనార్హం.






