ఎన్‌ఐటీలో ఆరోగ్య అవగాహన సదస్సు
- సీపీఆర్ పై శిక్షణ కార్యక్రమం
హనుమకొండ,(విజయక్రాంతి): సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే నైపుణ్యాలను పరిచయం చేయడానికి మెడికవర్ హాస్పిటల్ వరంగల్ ఆధ్వర్యంలో ఎన్‌ఐటీ వరంగల్ సెమినార్ హాల్‌లో సమగ్ర ఆరోగ్య అవగాహన సదస్సుతో పాటు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెన్స్ట్రువల్ సైకిల్ డ్రైవ్ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మహిళలకు సంబంధిత ఆరోగ్య అవగాహన, పరిశుభ్రత అలవాట్లు, మహిళల ఆరోగ్యంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.ఈ అవగాహన సదస్సుకు అత్యవసర వైద్య నిపుణురాలు డాక్టర్ సుష్మ ప్రియాంక తంగెళ్ల ముఖ్య వక్తగా పాల్గొని విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. మాసిక ధర్మానికి సంబంధించిన శారీరక మార్పులు, సాధారణ అపోహలు, మహిళల ఆరోగ్యంపై బహిరంగ చర్చల అవసరం గురించి ఆమె వివరించారు.
ఆరోగ్య అవగాహన కార్యక్రమంతో పాటు సీపీఆర్‌పై ప్రాక్టికల్ శిక్షణ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి తక్షణ సహాయం ఎలా అందించాలి అనే అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.ఈ శిక్షణకు హాజరైనవారు అత్యంత ఆసక్తితో పాల్గొని అత్యవసర సమయంలో స్పందించేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఐటీ వరంగల్ విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.




