శ్రీ వెంకటేశ్వర స్వామికి బోనాల ఊరేగింపు
పాల్గొన్న సర్పంచి పావని నరేందర్ గౌడ్, గ్రామ పెద్దలు, మహిళలు
పాపన్నపేట: పాపన్నపేట మండల కేంద్రంలోని గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. శ్రీ రామనవమిని పురస్కరించుకొని ప్రతి ఏటా గుట్టపై మూడు రోజులపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి గ్రామస్తులు బోనాలను సమర్పించారు. పసుపు, కుంకుమ, వేపకొమ్మలతో కుండను అందంగా తీర్చిదిద్ది నైవేద్యంతో మహిళలు బోనాలను గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి స్వామికి సమర్పించారు. ఆదివారం రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. గ్రామస్తులందరూ బోనాల ఊరేగింపును కనులారా తిలకించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి పావని నరేందర్ గౌడ్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.




