28 March, 2026 | 11:52 PM

తెలంగాణ జాగృతిలోకి భారీగా చేరికలు

28-03-2026 10:40 PM

రాష్ట్రంలో రాజకీయ శూన్యతను పూరిస్తున్న కవితమ్మ నాయకత్వం

మొయినాబాద్(విజయక్రాంతి): తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రూప్ సింగ్, జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, జిల్లా బీసీ  సెల్ అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్ ఆధ్వర్యంలో చేవెళ్ళ, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నుండి సుమారు 100 మందికి పైగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తెలంగాణ జాగృతిలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షతన పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి కార్యనిర్వాహక అధ్యక్షుడు రూప్ సింగ్, రాష్ర అధికార ప్రతినిధి నల్లమల్ల శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు దూకుంట్ల నరేష్, వరలక్ష్మి, శ్రీనివాస్ తదితర నేతలు కొత్తగా చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత తో పాటు జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, జాగృతి రంగారెడ్డి జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు కుమ్మరి శివకుమార్ లు మాట్లాడుతూ రాజకీయ ప్రత్యామ్నాయం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైన సంధిదశలో ఉందని, ప్రజలు ఆశిస్తున్న అభ్యుదయకరమైన నాయకత్వాన్ని అందించేందుకు కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలోని 'తెలంగాణ జాగృతి' సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ఉద్యమ కాలం నుండి తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో కవితమ్మ పోషించిన పాత్ర అసామాన్యమైనదని, ఇప్పుడు అదే స్ఫూర్తితో ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని, యువత, మహిళలు, మరియు బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రయాణం ఒక పెద్ద భరోసా అని ఆయన అన్నారు.

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత రాజకీయ గందరగోళానికి తెరదించి, ప్రగతిశీల మార్గంలో తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయబోతున్నట్లు వెల్లడించారు.  పార్టీలో చేరిన వారిలో ముఖ్యలు. సంగేరి నగేష్, పుట్నాల పరమేష్ గౌడ్, గుణాల మాధవ రెడ్డి, గౌరవ్ కుమార్, గౌరవ్ మల్లేష్, తుమ్మలూరు అంజయ్య, గోల రాజు, వీరేష్, సంజీవ రెడ్డి, నగేష్, షణ్ముఖ్ కుమార్, విశాల్, శివరామకృష్ణా రెడ్డి, కార్తీక్ రెడ్డి, ఆనంద్,  తదితర ముఖ్య నేతలు ఉన్నారు.